సన్నాలు కొనలేదు
ABN , First Publish Date - 2020-12-13T05:50:56+05:30 IST
మండలంలో సన్న ధాన్యం ఒక్క గింజ కూడ కొనకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మధ్యలోనే నిలిపివేశారు.

నారాయణ ఖేడ్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత
నారాయణఖేడ్, డిసెంబరు 12: మండలంలో సన్న ధాన్యం ఒక్క గింజ కూడ కొనకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మధ్యలోనే నిలిపివేశారు. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అంతే కాకుండా సన్నరకం వడ్లను సాగు చేయాలని విస్తృత ప్రచారం చేశారు. ఈ మేరకు రైతులు గ్రామాల్లో అధిక శాతం సన్నరకం వరిని సాగు చేశారు. తీరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాక అధికారులు దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆందోళన దరిమిలా దొడ్డురకం పూర్తయ్యాక సన్నరకం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. దీంతో రైతులు అధికారుల మాటలను నమ్మి వేచిచూసే ధొరణిలో ఉన్నప్పటికీ, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వగానే సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లను చేపట్టేందుకు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యాన్ని జల్లెడ పట్టాలని ఓ మారు చెబుతూ రైస్‌మిల్లర్లు తీసుకోవడం లేదంటూ కొనుగోళ్లను నిలిపి వేశారు. దీంతో నారాయణఖేడ్ మండలంలోని అన్ని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను మూసి వేశారు. మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 14 వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో సన్నరకం ధాన్యం కొనుగోలు చేపట్టక ముందే మూసి వేశారు. దీంతో రైతులు దళారులకు తాము పండించిన పంటను అమ్ముకుంటున్నారు. ఒక్క మాద్వార్‌లోనే రైతులు ఐదారు లారీల సన్నరకం ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు. సన్నరకం ధాన్యం రైస్‌మిల్లర్లు స్వీకరించడం లేదని, రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోళ్లు చేశారని కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న ఐకేపీ సీఏ గోపాల్ తెలిపారు. లింగాపూర్‌లో సైతం కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ విషయంపై సీసీ సుందర్‌లాల్‌ను వివరణ కోరగా హమాలీలు రాలేదంటూ తప్పించుకున్నారు. ఇలా మొత్తం మండల వ్యాప్తంగా కేంద్రాలను మూసి వేయడంతో రైతులు దళారులకు తమ ధాన్యాన్ని విక్రయించుకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. దళారులు, ఐకేపీ అధికారులు కుమ్మక్కై కేంద్రాలను మూసి వేశారా అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
