కరోనా ఎఫెక్ట్‌తో సంగారెడ్డి జిల్లా లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-23T06:32:24+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం ఈ నెల 31 వరకు తెలంగాణ అంతటా లాక్‌డౌన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం...

- రాష్ట్రంలో ప్రభావిత ఐదు జిల్లాలో సంగారెడ్డి
- కేంద్రం ప్రకటనతో చర్చనీయాంశం
- రాష్ట్రమంతా నెలాఖరు వరకు ఇదే పరిస్థితి
- అంతర్ రాష్ట్ర సరిహద్దులు మూసివేత
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి 22: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం ఈ నెల 31 వరకు తెలంగాణ అంతటా లాక్‌డౌన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా 74 జిల్లాలో కరోనా ప్రభావం ఉన్నట్టు కేంద్రం ప్రకటించిన జాబితాలో సంగారెడ్డి జిల్లా ఉండడం చర్చనీయాంశమైంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో కరోనా ప్రభావం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు, సరిహద్దులో ఉండడం వల్లే సంగారెడ్డి జిల్లాను కరోనా ప్రభావిత జిల్లాగా కేంద్రం ప్రకటించి ఉండవచ్చని జిల్లావైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, తెలగాణ అంతటా ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. కర్నాటక, మహరాష్ట్రల సరిహద్దు ప్రాంతమైన చిరాగ్‌పల్లి వద్ద, కర్నాటకలోని బీదర్ నుంచి మన జిల్లాలోకి వచ్చే సరిహద్దు ప్రాంతమైన గుంజొట్టి సమీపంలోని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు మోహరించనున్నారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి రహదారులను మూసివేస్తున్నారు. కర్నాటక, మహరాష్ట్రల నుంచి జిల్లాలోకి ఎవరినీ రానీయకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది.
కరోనా ప్రభావం లేదు
సంగారెడ్డి జిల్లాలో కరోనా ప్రభావం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మోజీరాంరాథోడ్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని కోరారు. అయితే సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలలో కరోనా ప్రభావం ఉండడంతో సంగారెడ్డిని కూడా కరోనా ప్రభావిత జిల్లాగా కేంద్రం ప్రకటించి ఉండవచ్చని రాథోడ్ తెలిపారు.