తోడేస్తున్నారు.. నదుల్లో భారీ గోతులు.. భూగర్భ జలాలు ఆవిరి

ABN , First Publish Date - 2020-07-27T19:59:09+05:30 IST

జిల్లాలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. మంజీరా నది, హల్దీ వాగుల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు.

తోడేస్తున్నారు.. నదుల్లో భారీ గోతులు.. భూగర్భ జలాలు ఆవిరి

మీటరు మందం వరకే అనుమతి.. మూడు, నాలుగు మీటర్ల లోతుకు తవ్వకం

సర్దన, కొంగోడులో నిబంధనలు బేఖాతరు


మెదక్‌ (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. మంజీరా నది, హల్దీ వాగుల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు. మీటరు లోతు తవ్వకాలకు అనుమతించిన చోట 3-4 మీటర్ల వరకు తవ్వుతున్నారు. ప్రభుత్వ పనులకు వినియోగించాల్సిన ఇసుకను    పక్కదారి పట్టిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. విచారణ చేపడితే దోపిడీపర్వం వెలుగుచూసే అవకాశముంది. 


గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను సమకూర్చేందుకు, ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక కొరతను తీర్చేందుకు హవేళీఘణపూర్‌ మండలం సర్దనలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంజీరా నదిలో రెండు క్వారీలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ లోడింగ్‌, ట్రాన్స్‌పోర్టు పనులు దక్కించుకున్న ఏజెన్సీల నిర్వాహకులు అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. మూడు జిల్లాలకు అవసరమైన ఇసుకను ఇక్కడి నుంచే తరలించారు. మార్చిలో ప్రారంభమైన ఇసుక తరలింపు నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం మొదలవడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. కానీ ఇప్పటికే వేలాది టన్నుల ఇసుకను నది పక్కనే పొలాల్లో డంప్‌ చేసిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఆ ఇసుకను విక్రయిస్తున్నారు. 


మంజీరాలో మూడు మీటర్ల వరకు తవ్వకం

సర్దన వద్ద ఒకటో నంబరు క్వారీలో మీటర్‌ వరకు, రెండో క్వారీలో 1.5 మీటర్ల వరకు తవ్వకానికి అనుమతిచ్చారు. అయితే కాంట్రాక్టర్లు మూడు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు ఇసుకను తోడేశారు. గట్టి నేల తగలడమో.. నీరు ఊరడమో జరిగితే కానీ తవ్వకాలు ఆపడం లేదు. ఇసుక తవ్వకం, తరలించే ప్రక్రియను పర్యవేక్షించాల్సిన టీఎ్‌సఎండీసీ అధికారులు మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. నదిలో భారీ గోతులు దర్శనమిస్తున్నాయి.


సర్దన క్వారీల నుంచి హైదరాబాద్‌కు పెద్దఎత్తున ఇసుక తరలించి విక్రయించారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం జీపీఎస్‌ ఉన్న వాహనాల్లో ఇసుకను గ్రామాలకు చేరవేయాల్సి ఉండగా.. మామూలు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల ఆగడాలతో నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడతామంటూ బెదిరించడంతో నోరుమూసుకుంటున్నారు.


కొంగోడులో ఇలా...

కొల్చారం మండలం కొంగోడు శివారులోని హల్దీవాగులో ఈ నెల 2 నుంచి 22 వరకు ఇసుక తరలింపునకు  కలెక్టర్‌ ధర్మారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. 14 మండలాల్లో జరుగుతున్న వైకుంఠధామాలు, రైతువేదికల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఇక్కడి నుంచే తరలించారు. ఇక్కడ ఏకంగా కాంటూర్‌ కందకాలను తొలగించి అటవీ భూమిలో మట్టి రోడ్డు నిర్మించి మరీ ఇసుక రవాణా చేసిన వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఇసుక తవ్వకాల్లోనూ సదరు కాంట్రాక్టర్‌ ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. స్థానిక అవసరాల కోసం అనుమతులు ఇచ్చినపుడు యంత్రాలతో తవ్వడం నిషేధం. కూలీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో నింపి రవాణా చేయాలి. కానీ కాంట్రాక్టర్‌ మాత్రం ఎక్స్‌కవేటర్లతో మీటరు లోతు వరకు ఇసుకను తోడేశారు.  వేబిల్లులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. అక్రమాలను అధికారులు అడ్డుకోకపోగా శాయశక్తులా సహకరించారు. 


కొంగోడు నుంచి తీసిన ఇసుకను హైదరాబాద్‌ తరలించి విక్రయించారనే ఆరోపణలున్నాయి. నగర శివారులోని గండిమైసమ్మ సమీపంలో రహస్య ప్రాంతంలో ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారని సమాచారం. కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాలకు రికార్డుల్లో పేర్కొన్న మేర ఇసుక ఇప్పటికీ చేరలేదని బీజేపీ నాయకులు ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మైనింగ్‌ శాఖ కానీ.. భూగర్భ జలవనరుల శాఖ కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఎవరైనా ప్రశ్నిస్తే అనుమతులివ్వడం వరకే తమ బాధ్యతని.. పర్యవేక్షణ చేయాల్సింది రెవెన్యూ శాఖనే అని చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో మండలంలో పనిచేసే రెవెన్యూ అధికారిపై పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. ఘణపురం ఆనకట్ట వద్ద ఇటీవల జరిపిన ఇసుక తవ్వకాల్లోనూ ఆయన వ్యవహారం వివాదాస్పదమైంది. చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు మాత్రం వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఇచ్చిన అనుమతులు.. జరిగిన తవ్వకాలపై సమగ్రంగా విచారణ చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2020-07-27T19:59:09+05:30 IST