కదలని ఆర్టీసీ అద్దె బస్సులు

ABN , First Publish Date - 2020-12-19T05:50:48+05:30 IST

వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. అరకొర జీతాలతోనే కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని,

కదలని ఆర్టీసీ అద్దె బస్సులు
డిపో మేనేజర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ప్రైవేట్‌ డ్రైవర్లు

వేతన సవరణ చేయాలని ప్రైవేటు డ్రైవర్ల ఆందోళన


మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 18: వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. అరకొర జీతాలతోనే కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు పని చేయించుకుంటూ వేతన సవరణ అగ్రిమెంట్‌ కాలపరిమితి దాటి ఆరు నెలలైనా యజమానులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. మెదక్‌ డిపోలో మొత్తం 111 బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 44 ఉండగా.. 67 అద్దె బస్సులు పర్మిట్‌తో పనిచేస్తున్నాయి. 50 అద్దె బస్సుల ప్రైవేట్‌ డ్రైవర్లు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లోకి వెళ్లకుండా ఆందోళన నిర్వహించారు. 


ఆరు నెలలుగా అమలుకు నోచుకోని వేతన అగ్రిమెంట్‌ 

అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి. ఆర్టీసీ అగ్రిమెంట్‌ ప్రకారం బ్యాంకుల ద్వారా ప్రతీనెల జీతాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లకోసారి వేతన అగ్రిమెంట్‌ చేసుకొని జీతాలు పెంచాల్సి ఉంటుంది. గత జూన్‌తో వేతన అగ్రిమెంట్‌ గడువు ముగిసింది. అయినా యజమానులు అగ్రిమెంట్‌ విషయంలో కాలయాపన చేస్తున్నారు. పాత జీతాలతోనే పని చేయించుకుంటున్నారు. దీంతో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులకు హాజరుకావడం లేదని గురువారమే డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ఉదయం డ్రైవర్లు, యజమానుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో విధుల్లోకి వెళ్ల్లేదిలేదని వారు తేల్చిచెప్పారు. అద్దె బస్సుల డ్రైవర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ డీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మహేందర్‌గౌడ్‌, ఎల్లారెడ్డి, సుదర్శనం, అస్లాం, కృష్ణా, బస్వరాజ్‌, సీపీఎం నాయకురాలు బాలమణి తదితరులు పాల్గొన్నారు. దింతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఉదయం 20 బస్సుల నడిచినా అనంతరం వాటిని కూడా నిలిపివేశారు. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిపో వద్దకు చేరుకుని డ్రైవర్లు ఇతర బస్సులను అడ్డుకోకుండా బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2020-12-19T05:50:48+05:30 IST