అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పెట్రోల్ సీసాతో ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన
ABN , First Publish Date - 2020-12-30T06:05:05+05:30 IST
ఆర్టీసీ కంట్రోలర్ విధుల్లోకి తీసుకోకుండా అవమానించాడని ఆరోపిస్తూ ఓ ఆర్టీసీ డ్రైవర్ డిపో మెనేజర్ కార్యాలయం ఎదుట భార్యా, పిల్లలతో కలిసి ఆందోళనకు దిగాడు.
సంగారెడ్డి క్రైం, డిసెంబరు 29: ఆర్టీసీ కంట్రోలర్ విధుల్లోకి తీసుకోకుండా అవమానించాడని ఆరోపిస్తూ ఓ ఆర్టీసీ డ్రైవర్ డిపో మెనేజర్ కార్యాలయం ఎదుట భార్యా, పిల్లలతో కలిసి ఆందోళనకు దిగాడు. పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన డ్రైవర్ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆత్యహత్య చేసుకుంటానని భీష్మించాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముండ్రాయికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.నాగభూషణం సంగారెడ్డి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఆయన విధులు నిర్వహించడానికి డిపోకు రాగా.. కంట్రోలర్ విధుల్లోకి తీసుకోలేదు. అంతేకాకుండా అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్తాపం చెందిన నాగభూషణం భార్యా, పిల్లలతో కలిసి డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగాడు. ఆర్డినరీ బస్సులు ఇచ్చి ఎక్స్‌ప్రెస్ రూట్లలో నడుపుమంటున్నారని, బ్రేకులు కూడా సరిగ్గా పనిచేయని ఆ బస్సులు నడపలేకపోతున్నామని బాధితుడు వాపోయాడు. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీనిపై డిపో మేనేజర్ స్పందించి డ్రైవర్‌తో మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.