చిల్లర పేరుతో బాదుడు

ABN , First Publish Date - 2020-12-15T05:57:56+05:30 IST

చిల్లర సమస్యల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం టికెట్‌ ధరలను పెంచింది. రూ.21 ఉన్న చార్జీని రూ.25కు పెంచింది.

చిల్లర పేరుతో బాదుడు
మెదక్‌లోని ఆర్టీసీ డిపో

ఆర్టీసీ టికెట్‌ ధరల పెంపు

సోమవారం నుంచి అమలులోకి సవరించిన చార్జీలు


మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 14: చిల్లర సమస్యల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం టికెట్‌ ధరలను పెంచింది. రూ.21 ఉన్న చార్జీని రూ.25కు పెంచింది. ప్రయోగాత్మకంగా మెదక్‌–సికింద్రాబాద్‌ (వయా నర్సాపూర్‌) పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. క్రమంగా అన్ని రూట్లలో అమలు చేయనుంది. సవరించిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.


సవరణతో భారం

ఒక వైపు ఆర్టీసీలో క్యాట్‌, జేహెచ్‌పీ(వారం) వంటి రాయితీలకు మంగళం పాడిన సంస్థ, బస్సు చార్జీల సవరణ పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపింది. చిల్లర సమస్య రాకుడదనే టికెట్‌ ధరల్లో సవరణలు చేశామని యాజమాన్యం ప్రకటించింది. సవరించిన చార్జీలు పల్లె వెలుగు బస్సుల్లో తొలుత అమలులోకి తీసుకువచ్చి, ఆపై అన్ని బస్సులకు వర్తింప జేయనున్నారు. 


చార్జీల పెంపు ఇలా..

సవరించిన చార్జీల టారీఫ్‌ ఇలా ఉండనుంది... ప్రస్తుతం రూ.13, రూ.17, రూ.21, రూ.34, రూ.38 ఉన్న చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేయనున్నారు. అంటే వరుసగా రూ.15, రూ.20, రూ.25, రూ.35, రూ.40కు పెరుగుతాయి. రెండు స్టేజీల వద్ద రూ.54 ఉన్న చార్జీ మాత్రం రూ.50కి తగ్గుతుంది.


ముందస్తు ప్రచారం లేకుండా

ఆర్టీసీ చార్జీల పెంపు గురించి గతంలోలా ముందస్తు ప్రచారం కల్పించకుండా నేరుగా అమలు చేయడం విమర్శలకు తావిస్తున్నది. చార్జీల సవరణలు చేసినప్పుడు గతంలో బస్సులపై పోస్టర్లు అంటించి ప్రచారం నిర్వహించేవారు. దీంతో పెంపు విషయం ప్రయాణికులకు తెలిసేది. కానీ ప్రస్తుతం హఠాత్తుగా చార్జీలను పెంచడంతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతుందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.

Read more