ఆర్టీఏలో కార్డుల్లేవ్!
ABN , First Publish Date - 2020-11-26T06:29:28+05:30 IST
కరోనా కష్టకాలం వచ్చినప్పటి నుంచి ఎన్నో పరిశ్రమలు ఆగిపోయాయి. అందులో ముఖ్యంగా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డుల తయారీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రింటింగ్‌కు నోచని 4,150 ఆర్సీలు, 2,000 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు
ఆగస్టు నుంచి ఆగిపోయిన సరఫరా
కొత్త కార్డులు వచ్చే దాకా కార్ల రిజిస్ర్టేషన్ బంద్
ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌లోనే కార్డులు అందుబాటులో
సిద్దిపేట సిటీ, నవంబరు 25 : కరోనా కష్టకాలం వచ్చినప్పటి నుంచి ఎన్నో పరిశ్రమలు ఆగిపోయాయి. అందులో ముఖ్యంగా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డుల తయారీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వాహనాల రిజిస్ర్టేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ వాటికి సంబంధించిన కార్డులు మాత్రం రావడం లేదు. అంతేకాకుండా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి కూడా ఇక్కట్లు తప్పడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతీ ఏడాది ఆర్సీ కార్డుల సరఫరా సక్రమంగా జరిగేది. కరోనా వచ్చినప్పటి నుంచి కార్డుల తయారీ నిలిచిపోవడంతో జిల్లాకు కార్డులు రావడం లేదు. దీంతో రిజిస్ర్టేషన్ చేసుకునే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నయి. ఆర్సీ కార్డులు ఈ ఏడాది ఆగస్టులో చివరిసారిగా వచ్చాయి. అవి అయిపోవడంతో వాహనాల రిజిస్ర్టేషన్ చేసుకున్నా కార్డుల కోసం కొన్ని నెలలుగా ఆగాల్సి వస్తోంది.
4,150 ఆర్సీ కార్డుల కొరత
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 4 నెలల నుంచి ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత ఉన్నది. 4,150 ఆర్సీ కార్డులు, 2,000 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్డుల జారీలో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
వాహనాలు అమ్మడం కష్టం
రిజిస్ర్టేషన్ చేసుకున్నా ఆర్సీ కార్డు రాకపోవడంతో అత్యవసర పరిస్థితిలో వాహనాలను అమ్మాలనుకునే వారికి కష్టంగా మారింది. ఎందుకంటే రిజిస్ర్టేషన్ ప్రక్రియ జరగాలంటే తప్పకుండా ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉండాలి. అది లేకుండా అమ్మడం, కొనడం జరుగదు. దీంతో చాలా మంది తమ వాహనాలకు మంచి ధర వచ్చినా అమ్మడం లేదు.
డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందక ఇబ్బందులు
ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు నెలల క్రితం లర్నింగ్ తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ కొసం ఫొటో దిగిన వారు లెసెన్స్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.
ఆర్టీఏ-ఎం వ్యాలెట్‌లోనే లభ్యం
రోజులు గడుస్తున్న కొద్దీ కాగితాల ప్రాముఖ్యం తగ్గుతూ వస్తున్నది. అన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఆర్టీఏ శాఖ కూడా ఇందులో అభివృద్ధి చెందింది. ఆర్సీ కార్డుల జాప్యం ఉన్నా ఎం- వ్యాలెట్ యాప్ ద్వారా వారి రిజిస్ర్టేషన్ పత్రాలను చూసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ యాప్ ద్వారా ఎక్కడికి వెళ్లినా పత్రాలను చూపించే ఆస్కారం ఉంది. ఇది వాహనదారులకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఈ ఆర్టీఏ-ఎం వ్యాలెట్‌లోనే వాహనాల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన కార్డులను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
త్వరగా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం
ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరతపై కాంట్రాక్టర్‌కు సిఫారసు చేశాం. అక్కడ కూడా కార్డుల కొరత ఉండడంతో తేలేకపోతున్నాం. వీలైనంత త్వరగా కార్డులు తేవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇబ్బంది పడకుండా రిజిస్ర్టేషన్ ప్రక్రియ యథాతధంగా కొనసాగుతుంది. పోలీసులు, అధికారులు తనీఖీ చేస్తే ఎం- వ్యాలెట్ ద్వారా పత్రాలను చూపించండి.
- రామేశ్యర్‌రెడ్డి, డీటీవో, సిద్దిపేట