పల్వట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-29T05:57:59+05:30 IST

బైక్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలోని పల్వట్ల గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగింది.

పల్వట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి


వట్‌పల్లి, డిసెంబరు 28 : బైక్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలోని పల్వట్ల గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం జగిర్యాల గ్రామానికి చెందిన హరీశ్‌(26) బైక్‌పై జోగిపేట నుంచి వట్‌పల్లి వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో వట్‌పల్లి మండలంలోని నిర్జప్ల గ్రామానికి చెందిన కుమ్మరి పాపయ్య (26) మండలంలోని మరువెళ్లి గ్రామం వద్ద నిర్జప్లకు వెళ్తానని పల్వట్ల గ్రామం వరకు లిఫ్ట్‌ ఇవ్వాలని హరీశ్‌ను కోరాడు. ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా పల్వట్ల శివారులో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి వీరి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో హరీశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, పాపయ్య(ప్రభు)ను కొద్ది దూరం కారు పంటచేనులోకి ఈడ్చుకెళ్లడంతో పాపయ్య కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల చేతులు ఘటనా స్థలంలో తెగిపడ్డాయి. వట్‌పల్లి ఎస్‌ఐ దశరథ్‌, జోగిపేట సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ఉన్న వారు ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలి పరారయినట్లు సీఐ తెలిపారు. కారు ఎక్కడ నుంచి వస్తున్నది, ఎవరినే వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. పల్వట్ల వద్ద జరిగిన విషయం తెలుసుకున్న అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.


Updated Date - 2020-12-29T05:57:59+05:30 IST