రోడ్డు విస్తరణ పనులు ఇంకెన్నేళ్లు?
ABN , First Publish Date - 2020-11-21T06:09:35+05:30 IST
జిల్లా కేంద్రంలో జరుగుతున్న రహదారి విస్తరణ ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకుల ఆందోళన
మెదక్ మున్సిపాలిటీ, నవంబరు 20: జిల్లా కేంద్రంలో జరుగుతున్న రహదారి విస్తరణ ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అభివృద్ధి పనులపై శుక్రవారం అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కమిషనర్ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేషశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న డివైడర్లు నేలకూలుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. నిర్మాణంలో నాణ్యతా లోపంతోనే డివైడర్లు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. వంద ఫీట్లు విస్తరణ చేయాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో సంగం కూడా విస్తరించడం లేదని మండిపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్లు విస్తరించాల్సిందేనని తేల్చిచెప్పారు. సంవత్సరాల తరబడి విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ శ్రీహరి స్పందిస్తూ రోడ్డు విస్తరణ పనులు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని అంశమని తేల్చిచెప్పారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ అవారి శేఖర్, అఖిలపక్షం నాయకులు మల్కాజి సత్యనారాయణ, గడ్డం కాశీనాథ్, నాయిని ప్రసాద్, అప్పాల సునీల్, బాల్‌రాజ్, శివ, అరేళ్ల అరవింద్‌గౌడ్, మల్లేషం, మాధవరెడ్డి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.