ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఊరట

ABN , First Publish Date - 2020-03-02T11:34:48+05:30 IST

గ్రామీణ ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఏడాదికోసారి ఉద్యోగాల రెన్యూవల్‌ విధానంలో మార్పు తెచ్చింది. పని దినాల లక్ష్యాన్ని

ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఊరట

  • ఏడాదికోసారి ఉద్యోగాల రెన్యూవల్‌ విధానంలో మార్పు
  • పని దినాల లక్ష్యం తగ్గింపు
  • పది రోజులు కూడా కూలీలకు పని కల్పించకపోతే వేటు
  • వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా నిర్ణయం
  • వేతన ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం

సిద్దిపేట: గ్రామీణ ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఏడాదికోసారి ఉద్యోగాల రెన్యూవల్‌ విధానంలో మార్పు తెచ్చింది. పని దినాల లక్ష్యాన్ని 30 శాతానికి తగ్గించింది. నిబంధనల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయోనని ఆందోళన చెందుతున్న ఎఫ్‌ఏలకు ఊరట లభించింది. 


ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరును అంచానా వేసి ఏడాదికోసారి ఉద్యోగాల రెన్యూవల్‌ విధానంలో కొత్త నిబంధనలను తెచ్చింది. దీనిపై కొద్ది రోజులుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన చేస్తున్నారు. పనితీరుకు కొలమానంగా ఉన్న నిబంధనల్లో మార్పులు చేయాలని వారు చేసిన ఒత్తిడి ఫలించింది. నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 


జిల్లాలో 399 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా జాబ్‌కార్డులు పొందిన కూలీలకు క్షేత్రస్థాయిలో క్లస్టర్‌కు ఒక ఫీల్డ్‌అసిస్టెంట్‌ను నియమించారు. వీరికి నెలనెలా వేతనాలు ఇస్తుంటారు. ఏడాదికోసారి వీరి పనితీరును పరిశీలించి ఉద్యోగాలను రెన్యూవల్‌ చేస్తారు. ఏటా జూలై 1 నుంచి మరుసటి సంవత్సరం జూన్‌ వరకు విధుల్లో కొనసాగిస్తారు. కాగా.. జిల్లాలో 499 గ్రామపంచాయతీలుండగా 399 క్లస్టర్‌లున్నాయి. వారు పనిచేసే పరిధిలో 40శాతం పని దినాలు వస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్ల కాంట్రాక్టు విధానాన్ని పునరుద్ధరిస్తారు. అంతకంటే తక్కువ పని దినాలు కల్పిస్తే జీతంలో సగం కోత విధించారు. అయితే.. పది శాతం కంటే తక్కువ పనిదినాలు కల్పించిన ఎఫ్‌ఏలను విధుల నుంచి తొలగించాలనే నిబంధన ఉన్నది. దాని ప్రకారం 2018, జూలై 1 నుంచి 2019, జూన్‌ నెలాఖరు వరకు కూలీలకు కల్పించిన పని దినాలను పరిగణనలోకి తీసుకుని ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరుపై నివేదికలను రూపొందించారు.  జిల్లాలో పని  చేస్తున్న ఎఫ్‌ఏల్లో 211 మంది మాత్రమే 40శాతం పనిదినాలు కల్పించినట్లు అధికారిక సమాచారం. 164 మంది 11నుంచి 39 పని దినాలను, 24 మంది ఎఫ్‌ఏలు 10 దినాలకంటే తక్కువే పని కల్పించారు. దీని ప్రకారం 211 మందికి  నెలకు రూ.10వేలు, 164 మందికి నెలకు రూ.5వేలు ఇవ్వాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో 24 మందిని తొలగించాలని అధికారులు ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. కాగా.. వారి ఆందోళన ఫలించి నిబంధనలలో మార్పులు తెస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దాని ప్రకారం క్లస్టర్‌లో 30శాతం పైగా పనిదినాలు కల్పించిన వారి కాంట్రాక్టు కొనసాగిస్తూ నెలకు రూ. 10వేల వేతనం ఇవ్వనున్నారు. 20 నుంచి 29 లోపు పనిదినాలు కల్పించిన వారిని కొనసాగిస్తూ అలవెన్సుతో కలిపి రూ.9వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. 10 నుంచి 18 పనిదినాలు కల్పించిన ఎఫ్‌ఏలకు నెలకు రూ.7500 వేతనం ఇవ్వనున్నారు. పది రోజులు కూడా కూలీలకు పని కల్పించిన ఎఫ్‌ఏలను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా తొలగింపునకు గురయ్యే ఎఫ్‌ఏల స్థానంలో నియమనిబంధనలను అనుసరించి వెంటనే కొత్తవారిని నియమించాలని పేర్కొన్నారు. ఏ కేటగిరికి చెందిన వారు ఉద్యోగం మానేశారో ఆ కేటగిరి కింద ఇచ్చే వేతనాన్నే కొత్తవారికి ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో పది శాతం లోపు పనిదినాలు కల్పించిన 24 క్లస్టర్లలో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాబ్‌కార్డులు పొందిన వారందరికీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనులు కల్పించాలని, వంద శాతం కార్డులను, పంచాయతీ రిజిస్టర్‌ను అప్‌డేట్‌ చేయాలని  పేర్కొన్నారు. మస్టర్‌ రోల్‌ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కూలీలకు ఎప్పటికప్పుడు పే స్లిప్‌లు అందజేయాలని, ప్రతి కూలీకి కనీస వేతనంగా రూ.180 వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కూలీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, హరితహరం కింద నర్సరీలను పెంచాలని, మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-02T11:34:48+05:30 IST