బాగారెడ్డి స్టేడియం బాగయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2020-03-21T10:36:50+05:30 IST

జహీరాబాద్‌ పట్టణంలో 1994లో ఏర్పాటు చేసిన బాగారెడ్డి స్టేడియంకు మరమ్మతులు కరువై శిథిలావస్థకు చేరుకుంది. జహీరాబాద్‌ పట్టణంలో

బాగారెడ్డి స్టేడియం బాగయ్యేదెన్నడో?

  • జహీరాబాద్‌ పట్టణంలో క్రీడలతో పాటు కార్యక్రమాలన్నింటికీ వేదిక
  • అద్దెల ద్వారా ఏటా రూ. కోటి ఆదాయం
  • అయినా కనిపించని అభివృద్ధి
  • మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరిన స్టేడియం


జహీరాబాద్‌, మార్చి 19: జహీరాబాద్‌ పట్టణంలో 1994లో ఏర్పాటు చేసిన బాగారెడ్డి స్టేడియంకు మరమ్మతులు కరువై శిథిలావస్థకు చేరుకుంది. జహీరాబాద్‌ పట్టణంలో అధికారిక, అనధికారిక సభలు, సమావేశాలు జరుపాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బాగారెడ్డి స్టేడియమే.  సుమారు పదిహేనేళ్ల క్రితం నిర్మించిన బాగారెడ్డి స్టేడియానికి ఇంతవరకూ ఎలాంటి మరమ్మతులు జరుగలేదంటే స్టేడియం అభివృద్ధి  విషయంలో పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతున్నది. స్టేడియంలో వేదికతో పాటు వేదికపైకి ఎక్కేందుకు మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. పాలకులు అభివృద్ధి ఊసే ఎత్తకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 


ఆదరణ సరే.. నిర్లక్ష్యమెందుకో?

స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, స్టేడియం కింద గల దుకాణాల ద్వారా ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటే కొంత మేరకు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఏటా స్టేడియంలో లైట్లు వేసేందుకుగాను ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులు లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంటారు కాని అద్దెల విషయం, స్టేడియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించలేకపోవడంలో ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ స్టేడియంలో తరచూ పెద్ద టోర్నమెంట్లు సైతం జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారు. బాగారెడ్డి స్టేడియం క్రీడల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతూనే ఉంది. పట్టణ ప్రజలు ప్రతిరోజూ వాకింగ్‌ చేసేందుకు వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం పట్టణ ప్రజలతో, క్రీడాకారులతో, విద్యార్థులతో, నాయకులతో రద్దీగా ఉండే ఈగ్రౌండ్‌ను అభివృద్ధి చేయడంలో ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారోననే విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.


నాడు 13 ఎకరాలు.. నేడు 4 మాత్రమే

ఒక్కప్పుడు ఈ గ్రౌండ్‌ సుమారు 13 ఎకరాల పైచిలుకు వరకు స్థలంలో ఉండగా అందులోనే వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలు కళాశాలలు, పాఠశాలలు ఏర్పాటు కావడంతో ప్రస్తుతం పూర్తిగా కుంచించుకు పోయింది. ప్రస్తుతం ఈ గ్రౌండ్‌ సుమారు 4 ఎకరాల పైచిలుకు స్థలంలోనే ఉంది. ప్రతిఏటా గ్రౌండ్‌ చుట్టూ హరితహారంలో మొక్కలు నాటుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా బతుకలేదు. మెట్లు, వేదిక శిథిలావస్థకు చేరుకున్నాయి.


ఏడాదికి రూ. కోటి వరకు అద్దెలు ఏమవుతున్నట్టో? 

బాగారెడ్డి స్టేడియంను రోడ్డుకు ఆనుకుని నిర్మించి సుమారు 20 పైచిలుకు దుకాణాలను ఏర్పాటు చేశారు. కనీసం ఈ అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను ఇస్తే  స్టేడియం కొంత మేరకైనా అభివృద్ధి చెందుతుందని అప్పట్లో అధికారులు, నాయకులు అంచనాలు వేసినట్లు సమాచారం.  అప్పుడప్పుడు ఈ దుకాణాల అద్దెల విషయం అధికారుల రివ్యూ సమావేశాల్లో  ప్రస్తావనకు వచ్చినా ఆ తర్వాత వాటి ఊసే ఎత్తరు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా  ఒక్కో షట్టర్‌కు  సుమారు నెలకు 4 నుంచి 5వేల రూపాయల వరకు వసూలు చేసినా నెలకు రూ 75వేల పైచిలుకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు స్టేడియం అద్దెలు రూ. కోటి వరకు వస్తాయని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా స్టేడియం అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


స్టేడియం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి- సంపత్‌కుమార్‌, జహీరాబాద్‌

జహీరాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన స్టేడియం అభివృద్ధి చేస్తే క్రీడాకారులకు, స్థానికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా స్టేడియం అభివృద్ధికి నోచుకోలేక పోయింది. జహీరాబాద్‌ పట్టణాన్ని అన్నిరంగాలను అభివృద్ధిచేసేందుకు కృషి చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్టేడియం అభివృద్ధిని మాత్రం మరిచారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా స్టేడియం అభివృద్ధి చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది. దీంతో పట్టణంలో క్రీడల అభివృద్ధికి ఊతం లభిస్తుంది.

Updated Date - 2020-03-21T10:36:50+05:30 IST