తెలంగాణ వచ్చాకే బుడగ జంగాలకు గుర్తింపు
ABN , First Publish Date - 2020-12-20T05:18:36+05:30 IST
తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలకు గుర్తింపు లభించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట సిటీ, డిసెంబరు 19: తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలకు గుర్తింపు లభించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన ఆదర్శ ఎస్సీ, బేడ బుడగ జంగం సంఘ భవనాన్ని, రూ.10 లక్షలతో నిర్మించిన వడ్డెర సంఘం భవనాన్ని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి ప్రారభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కడు పేదరికంలో ఉన్న వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డబుల్ రూమ్ పథకంలో సంచార జాతులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
యూజీడీ కనెక్షన్లకు ప్రజలపై భారం వేయం
సిద్దిపేట పట్టణంలో యూజీడీ నిర్మాణానికి రూ.250 కోట్లను వెచ్చించినట్లు మంత్రి చెప్పారు. యూజీడీ కనెక్షన్లు ఎవరి ఇంటికి వారే ఇచ్చుకోవాల్సి ఉన్నా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా రూ.5 నుంచి 8 కోట్లు వెచ్చించి ప్రతీ ఇంటికీ యూజీడీ కనెక్షన్లు ఇస్తామని మంత్రి చెప్పారు.