ఇక ఆర్టీఏ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
ABN , First Publish Date - 2020-03-24T05:59:01+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం ఆర్టీఏ శాఖపై పడింది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులకు అనుమతిని రద్దు చేశారు. స్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలు...

- వాహనాల యజమానులు కార్యాలయానికి రావొద్దు
- ఇంటి నుంచే రిజిస్ట్రేషన్లు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారుల నిర్ణయం
మెదక్ అర్బన్, మార్చి23: కరోనా వైరస్ ప్రభావం ఆర్టీఏ శాఖపై పడింది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులకు అనుమతిని రద్దు చేశారు. స్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలు... ఇంటి నుంచే ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్‌లో పొందేలా మార్పులు చేశారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్, వాహన బదిలీ, ఇతర సేవలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ స్లాట్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ టీఆర్ నంబరు పేపర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుంటే వన్‌టైం పాస్‌వర్డ్ నంబర్ చేసి వాహనానికి పరిపాలనాధికారి స్ధాయిలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పటిన తర్వాత ఇచ్చే ప్రకటనతో ఆర్టీఏ కార్యాలయానికి వాహనాలను తీసుకురావాలి... అప్పటి వరకు ఎవరూ రావొద్దని జిల్లా రవాణా అధికారి శ్రీనివా్‌సగౌడ్ సూచించారు.
వాహనదారులకు తప్పనున్న ఇబ్బందులు
వాహన కొనుగోలు చేసిన వారు ఆర్టీఏ కార్యాలయానికి వేళ్లకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునేలా రవాణా శాఖ సమూల మార్పులు చేసింది. ఇప్పటివరకు వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు తాత్కాలిక నంబర్ ఇవ్వడం, తర్వాత ఆర్టీఏ నుంచి పర్మినెంట్ నంబరు పొందాల్సి ఉండేది. ఇందుకోసం వాహనదారులు కార్యాలయంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. కరోనా నేపథ్యంలో ఆ బాధ తప్పింది. వాహనం కొనుగోలు చేయగానే పర్మినెంట్ నంబరు కోసం వాహన యజమాని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, వేలిముద్ర వేసిన వెంటనే ఆర్టీఏ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయగానే వాహనానికి నంబర్ కేటాయించినట్లు ఆర్టీఏ నుంచి యజమాని ఫోన్‌కు మేసేజ్ వస్తుంది. కొత్త విధానం ప్రకారం వాహనానికి నంబర్ కేటాయింపుతోపాటు నంబర్ ప్లేట్‌ను కూడా షోరూంలో తీసుకునే అవకాశం కల్పించారు. ఈ నెలాఖరు లోపే బీఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నెలాఖరులోగా రిజిస్ట్రేషన్లను చేయించుకోకపోతే ఆ వాహనాలను రోడ్లపై తిరగనివ్వమని, భారీ జరిమానా విధించి, వాహనాలను స్ర్కాప్‌నకు తరలిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లు చేసుకోవాలని కోరుతున్నారు.