శరవేగంగా ఇన్‌టెక్‌వెల్‌ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-12-07T05:53:35+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అటు సింగూరు, ఇటు మంజీరా రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని, కళకళలాడుతున్నాయి.

శరవేగంగా ఇన్‌టెక్‌వెల్‌ పునరుద్ధరణ
రాజంపేటలోని మంజీరా ఫిల్టర్‌బెడ్‌లో మోటార్లను, పైపులను మరమ్మతు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

నాలుగేళ్ల తర్వాత వినియోగంలోకి రానున్న రాజంపేట ఫిల్టర్‌బెడ్‌

జనవరి 1 నుంచి రోజుకు రెండు గంటల పాటు మంజీరా నీరు

సంగారెడ్డి పట్టణ ప్రజలకు తీరనున్న తాగునీటి సమస్య


సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 6  : ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అటు సింగూరు, ఇటు మంజీరా రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని, కళకళలాడుతున్నాయి. నాలుగేళ్లుగా సరైన వర్షాలు కురియక సింగూరు, మంజీరాలు ఎండిపోగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే సింగూరు జలాశయం నుంచి 2016లో శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌కు 15 టీఎంసీల నీటిని తరలించడంతో పాటు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. ఫలితంగా సింగూరు, మంజీరా ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేస్తున్న మంజీరాలోని ఇన్‌టెక్‌వెల్‌తో పాటు రాజంపేటలోని ఫిల్టర్‌బెడ్‌ నాలుగేళ్ల పాటు మూతపడ్డాయి. ఫలితంగా పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే మిషన్‌ భగీరథ ద్వారా అప్పుడప్పుడు నీటిని అందించినప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్య తీరేది కాదు. మునిసిపల్‌ అదికారులకు పట్టణంలో తాగునీటి సమస్య తలనొప్పిగా మారింది. గత నెలలో భారీ వర్షాలు కురిసి సింగూరు, మంజీరా ప్రాజెక్టులు నిండడంతో తాగునీటి సమస్య దూరం కానున్నది.

మంజీరా జలాశయం నిండడంతో నాలుగేళ్లుగా మూసి ఉన్న ఇన్‌టెక్‌వెల్‌, రాజంపేట ఫిల్టర్‌బెడ్‌ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌లలో మోటార్లు, పైపులు మరమ్మతులతో పాటు ఇతర పనులను మున్సిపల్‌ సిబ్బంది శరవేగంగా సాగిస్తున్నారు. గత వారం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంజీరా ప్రాజెక్టులోని ఇన్‌టెక్‌వెల్‌, రాజంపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. నాలుగేళ్లుగా మంజీరా పైపులు, మోటార్లు, ఇతర పరికరాలు పని చేయకపోవడంతో తుప్పుపట్టే అవకాశం ఉన్నందున వాటిని మార్చి కొత్త వాటిని అమర్చాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. దీంతో పునరుద్ధరణ పనులను శరవేగంగా చేస్తున్నారు. 


రూ.120 కోట్లతో మంజీరా నీటి సరఫరా

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ఇంటింటికి శుద్ధి చేసిన మంజీరా నీటిని అందించాలన్న ఉద్దేశంతో 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం లో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి చొరవతో రూ.120 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ శివారులోని 1.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన మంజీరా రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో ఇన్‌టెక్‌వెల్‌ను, పట్టణంలోని రాజంపేటలో 10 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించారు. వీటితో పాటు పట్టణంలోని 123 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటికి పైపులైన్‌లు, నల్లాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో ప్రస్తుతం 38 వార్డులుండగా, 19 వేల పైగా గృహాలు, 15 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు లక్ష జనాభా కలిగిన సంగారెడ్డిలో రోజుకు 10 ఎంఎల్‌డీ తాగునీటి అవసరం ఉంటుంది. పట్టణానికి అవసరమైన మేరకు మంజీరాలోని ఇన్‌టెక్‌వెల్‌ ద్వారా రాజంపేటలోని ఫిల్టర్‌బెడ్‌లోకి రోజు 10 ఎంఎల్‌డీ (కోటి లీటర్లు) నీటిని తరలించి, శుద్ధి చేసి పట్టణ ప్రజలకు సరఫరా చేయనున్నారు.

Updated Date - 2020-12-07T05:53:35+05:30 IST