స్వచ్ఛ పనుల్లో పుర‘పాలకులు’ బిజీ
ABN , First Publish Date - 2020-05-18T09:51:30+05:30 IST
మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల పరిధిలో ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగించారు.

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ప్రజాప్రతినిధులు ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల డ్రైడే నిర్వహించారు. స్వచ్ఛకార్యక్రమాల్లో పాల్గొని తమ ఇళ్లు, పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రం చేశారు.
మెదక్ మున్సిపాలిటీ, మే 17: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల పరిధిలో ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగించారు. ఈ సందర్భంగా చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ ఇల్లు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా పాలకవర్గం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అందుకు అనుగుణంగానే మున్సిపల్ అధికారులు సైతం అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
రామాయంపేట, మే 17: మెదక్‌జిల్లా రామాయం పేటలో ఆదివారం మున్సిపల్‌చైర్మన్, కౌన్సిలర్లు తమ ఇళ్లలో శుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. రామాయంపేట అయ్యప్ప ఆలయంలో మున్సిపల్ చైర ్మన్ పల్లె జితెందర్‌గౌడ్ ఎండిన అరటి ఆకులను తొలగించారు. సరిగ్గా 10 గంటలకు ప్రజాప్రతినిధులతో పాటు చాలా మంది వీధులు, ఇళ్లలోనూ దోమలను పారదోలేందుకు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
తూప్రాన్, మే 17: తూప్రాన్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తమ ఇళ్లతో పాటు పరిసరాలు శుభ్రం చేశారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్‌గౌడ్ పడాలపల్లిలోని స్వగృహంలోని గార్డెన్‌ను శుభ్రం చేశారు. వైస్‌చైర్మన్ నందాల శ్రీనివాస్ ఇంట్లో కిచెన్‌ను శుభ్రం చేయగా, కౌన్సిలర్లు ఇళ్లలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
జోగిపేట రూరల్, మే 17: సంగారెడ్డి జిల్లాలోని అందోలు-జోగిపేట మున్సిపల్‌చైర్మన్ గూడెం మల్లయ్య ఆదివారం తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ఉదయం 10 గంటలకు పది నిమిషాల పాటు ఆయన తన ఇంటి పరిసరాల్లో పెరిగిన పిచ్చిమొక్కలను శుభ్రం చేసి, ఆ తర్వాత నీటిపైపుతో పరిసరాలన్నింటినీ శుభ్రంగా కడిగారు.
జిన్నారం, మే 17: వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఆదివారం ప్రజాప్రతినిధులు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. బొల్లారంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రోజారాణి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, జిన్నారంలో ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌లు తమ నివాసాల వద్ద పరిసరాల శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలను వారు నిర్వహించారు.