కాళ్లు ఒత్తడమూ హౌస్ కీపింగేనా?
ABN , First Publish Date - 2020-12-15T05:56:26+05:30 IST
హౌస్‌కీపింగ్ సిబ్బంది విధి భవనాన్ని శుభ్రంగా ఉంచడం, టాయిలెట్లను క్లీన్ చేయడం, ఎక్కడ చెత్తాచెదారం లేకుండా చూడడం.. కానీ ఈ పనికి కొత్త నిర్వచనం చెప్పారు ఓ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్. తమ కాళ్లు కూడా ఒత్తితేనే ఉద్యోగం ఉంటుందని చెప్పారు.
అల్గోల్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో సిబ్బందితో
వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రిన్సిపాల్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 14 : హౌస్‌కీపింగ్ సిబ్బంది విధి భవనాన్ని శుభ్రంగా ఉంచడం, టాయిలెట్లను క్లీన్ చేయడం, ఎక్కడ చెత్తాచెదారం లేకుండా చూడడం.. కానీ ఈ పనికి కొత్త నిర్వచనం చెప్పారు ఓ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్. తమ కాళ్లు కూడా ఒత్తితేనే ఉద్యోగం ఉంటుందని చెప్పారు. దీంతో చేసేది లేక సదరు హౌస్‌కీపింగ్ సిబ్బంది రోజూ ప్రిన్సిపాల్ కాళ్లు ఒత్తుతున్నారు. ఆమెతో పాటే మరో ఉద్యోగి కూడా ఈ సేవలు చేయించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుధ్య పనులకోసం హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు. వీళ్లలో ఓ ఇద్దరు మహిళలు రోజూ ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి కాళ్లు పట్టాల్సి వస్తున్నది. ఇదంతా స్కూల్‌లోనే జరుగుతున్నది. ఇదే పాఠశాలలో కీలక విధులు నిర్వర్తిస్తున్న మరో ఉద్యోగి కూడా సదరు హౌస్‌కీపింగ్ సిబ్బందితో కాళ్లు ఒత్తించుకోవడం కెమెరాకు చిక్కింది. ఈ విషయమై వివరణ కోరేందుకు సోమవారం సాయంత్రం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్ చేయగా ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి కట్ చేశారు.