మనస్తాపంతో గర్భిణి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-02T11:19:26+05:30 IST
తల్లి తనతో తీసుకెళ్లలేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

- తల్లి తనను ఊరికి తీసుకెళ్లలేదని మనస్తాపం
- ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసికుని మృతి
- కేసు నమోదు చేసుకుని
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంగారెడ్డి రూరల్: తల్లి తనతో తీసుకెళ్లలేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా ఉలవపాడుకు చెందిన తన్నీరు ఆదిలక్ష్మి భర్త కోటేశ్వర్‌రావు దంపతుల చిన్న కుమార్తె శివకుమారికి లక్ష్మికాంత్‌తో 28ఆగస్టు 2019లో వివాహం చేశారు. భార్యభర్తలు బతుకుదెరువు కోసం సంగారెడ్డికి వచ్చి సప్తగిరి కాలనీలో అద్దెకు ఉంటున్నారు. లక్ష్మీకాంత్ మేస్త్రీ పని చేస్తూ భార్యను పోషిస్తున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు కూడా. శివకుమారి తల్లి ఆదిలక్ష్మి ఫిబ్రవరిలో ఓ విందుకు వచ్చి కూతురి దగ్గరకు వెళ్లింది. తల్లితో తనను ఊరికి తీసుకెళ్లాలని శివకుమారి కోరింది. మూడు నెలల గర్భిణీగా ఉన్నందున తరువాత వచ్చి తీసుకువెళ్తానని ఆదిలక్ష్మి కూతురిని సముదాయించి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన శివకుమారి భర్త పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూడగా శివకుమారి ఉరేసుకున్న విషయాన్ని అత్తగారికి ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. మృతురాలి తల్లి ఆదిలక్ష్మి ఫిర్యాదుతో నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. తమకు ఎవరిపై అనుమానం లేదని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి తల్లి పోలీసులను వేడుకున్నారు.