దర్శనం బంద్‌.. 31 వరకు ఆలయాల్లో భక్తులకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-03-21T10:45:17+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ఆలయాలకు సోకింది. కరోనా భయంతో విద్యాలయాలు, సినిమాహాళ్లు, బార్లు ఇప్పటికే

దర్శనం బంద్‌.. 31 వరకు ఆలయాల్లో భక్తులకు నో ఎంట్రీ

  • జిల్లా వ్యాప్తంగా చర్చిలకు తాళాలు
  • యథావిధిగా కొనసాగిన మసీదులు
  • తగిన జాగ్రత్తలతో ప్రార్థనలు

సంగారెడ్డి టౌన్‌, మార్చి 20 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ఆలయాలకు సోకింది. కరోనా భయంతో విద్యాలయాలు, సినిమాహాళ్లు, బార్లు ఇప్పటికే మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయాలపైనా ఈ ప్రభావం పడింది. నిత్యం భక్తుల తాకిడితో పోటెత్తే ప్రముఖ ఆలయాలు సైతం వెలవెలబోతున్నాయి. ఈ నెల 31 వరకు అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు, భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ కమిటీలు ప్రకటించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ శుక్రవారం నుంచి మూతపడ్డాయి. ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరాలయంలో ప్రధాన ద్వారంతో పాటు అమృతగుండానికి తాళం వేశారు. గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండగా శుక్రవారం జరగాల్సిన రథోత్సవాన్ని వాయిదా వేశారు. పటాన్‌చెరు మండలం బీరంగూడలోని భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయం, గణే్‌షగడ్డ వినాయకుడి ఆలయం, న్యాల్‌కల్‌ మండలంలో రేజింతల్‌ సిద్ధివినాయక ఆలయంతో పాటు ఇతర ప్రముఖ క్షేత్రాల్లో భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. కోహీర్‌ మండలంలోని బడంపేట రాచన్న స్వామి ఆలయంలో దర్శనంను నిలిపివేసిన అర్చకులు కరోనా వైరస్‌ నివారణ చర్యల గురించి వివరిస్తూ ఆలయంలో సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని వైకుంఠపురం ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నప్పటికీ భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది.


ప్రార్థన మందిరాలు మూత

జిల్లాలోని చర్చీలు కూడా మూత పడ్డాయి. సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం, సదాశివపేట ప్రాంతాల్లోని అనేక చర్చీల మెయిన్‌ గేట్‌లకు తాళాలు వేసి, ప్రార్థనలను నిలిపివేశారు. అయితే ముస్లింల ప్రార్థన మందిరాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజు మసీదులన్నింటిలో తగిన జాగ్రత్తల మధ్య ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

Updated Date - 2020-03-21T10:45:17+05:30 IST