పవర్‌ పంచాయతీ

ABN , First Publish Date - 2020-11-13T09:48:24+05:30 IST

గ్రామాల్లో విధీ దీపాల నిర్వహణలో లోపాలను సవరించి, పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల బారాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకే వీధి దీపాల ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతను ప్రైవేటు

పవర్‌ పంచాయతీ

ప్రైవేటుకు వీధి దీపాల నిర్వహణ 

తీర్మానాలు ఇవ్వాలంటూ పంచాయతీలపై ఒత్తిడి

ససేమిరా అంటున్న సర్పంచ్‌లు 

జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు

ఇప్పటి వరకు తీర్మానాలు ఇచ్చింది 220 మాత్రమే

ప్రభుత్వ నిర్ణయంపై పోరాటానికి సిద్ధమంటున్న సర్పంచులు


మెదక్‌ రూరల్‌, నవంబరు 12: గ్రామాల్లో విధీ దీపాల నిర్వహణలో లోపాలను సవరించి, పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల బారాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకే వీధి దీపాల ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై గ్రామాల్లో వీధి దీపాలు, వాటికి ఆటోమెటిక్‌ టైమర్ల ఏర్పాటు, లోపాలు సరిచేయడం తదితర పనులన్నీ ఇకపై ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ సంస్థ పరిధిలోకి వెళ్తాయి. ఇందుకోసం పంచాయతీలు ఎన్ని బల్బులు ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది.  రాబోయే 7 సంవత్సరాల వరకు బల్బుల బాధ్యత పూర్తిగా ప్రైవేట్‌ సంస్థే చూసుకుంటుంది. ఈమేరకు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆయా గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ వీధీ దీపాలు ఏర్పాటు చేయాలి, 18, 35, 70, 110, 190 వాట్‌ల సామర్థ్యం కలిగిన ఎల్‌ఈడీ బల్బులు ఎన్ని అవసరమనే అంశాలపై నివేదికలు తెప్పించారు. వీధీ దీపాల నిర్వహణ, పరిశీలన, క్రమబద్దీకరణ కోసం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 


మండిపడుతున్న సర్పంచ్‌లు

వీధి దీపాల బాధ్యత ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఇప్పటికే సర్పంచుల బాధ్యతలు తగ్గిస్తున్న ప్రభుత్వం గ్రామ ప్రజలకు ప్రధాన అవసరమైన వీధి దీపాల బాధ్యతలు కూడా మరొకరికి ఇస్తే తాము ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఒత్తిడితో 220 పంచాయతీలు తీర్మానాలు ఇచ్చినా.. ఇంకా 249 జీపీలు మాత్రం ససేమిరా అంటున్నాయి. దీనిపై ఇప్పటికే పలు జిల్లాలో పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణంలో మెదక్‌ జిల్లాలోనూ తీర్మానాలు ఇవ్వకుండా ఆందోళన నిర్వహించాలని మెజార్టీ సర్పంచులు యోచిస్తున్నారు. కార్యచరణపై చర్చించడానికి ఇటీవల జిల్లా కేంద్రంలో సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ ఫోరం మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. మెజార్టీ సర్పంచులు అధికార పార్టీకి చెందినవారే కావడంతో అప్పుడే ధర్నాలు చేయడం సరికాదని, ముందుగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు.


జిల్లాలో 96.4 లక్షల విద్యుత్‌ బిల్లులు

జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ప్రతీ నెల దాదాపు రూ. 96.4 లక్షల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో పాటు నీటి మోటార్ల బిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. వీధి దీపాలు ప్రైవేటుకు అప్పగించినా బిల్లులు మాత్రమే గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు లేవు. నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థ ఆయా గ్రామాల్లో అవసరమైతే ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తుంది. తద్వారా విద్యుత్‌ బిల్లులు తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తున్నది. అన్ని పంచాయతీలు తీర్మానాలు ఇస్తే త్వరలోనే విద్యుత్‌ దీపాల నిర్వాహణా బాధ్యతలు చేతులు మరే అవకాశముంది.


ప్రైవేటుకు ఇవ్వడం సరికాదు

గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల బాధ్యత ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. బిల్లులు పంచాయతీలు చెల్లిస్తే నిర్వహణ మరొకరికి ఇవ్వడం సమంజసం కాదు. ప్రస్తుతం విధి దీపాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకున్నా ప్రైవేటు సంస్థ ఎందుకు? ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలి.

-ప్రభాకర్‌, సర్పంచ్‌, మంబోజిపల్లి 


పంచాతీయలకు భారం తగ్గుతుంది

గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ భారం ప్రతీయేటా పెరిగిపోతున్నది. దీనిని తగ్గించడానికే ప్రభుత్వం ఈఈఎ్‌సఎల్‌ సంస్థతో ఏడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలు చెడిపోయినా, వెలుగకపోయినా వారిదే బాధ్యత. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో అంతరాయం ఏర్పడినా.. త్వరలోనే అన్ని జీపీల నుంచి తీర్మానాలు తీసుకుంటాం.

-శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీపీవో

Updated Date - 2020-11-13T09:48:24+05:30 IST