దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , First Publish Date - 2020-10-12T10:52:04+05:30 IST

దివ్యాంగులకు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తున్నామని, కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల

దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

కలెక్టర్‌, ఎన్నికల అధికారి వెంకట్రామారెడ్డి


సిద్దిపేట సిటీ, అక్టోబరు 11 : దివ్యాంగులకు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తున్నామని, కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి వెంకట్రామారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో గుర్తించబడిన 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఎంచుకోవడానికి అవసరమైన పత్రాలను వారి ఇళ్లకే సంబంధిత బూత్‌స్థాయి అధికారి(బీఎల్‌వో) పంపిస్తారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో అంగీకారం ఇస్తూ పూరించిన 12- డీ ఫాం పత్రాలను ఈ నెల 14వ తేదీ కల్లా బీఎల్‌వోలు రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో)కి సమర్పిస్తారని పేర్కొన్నారు. వచ్చిన పత్రాలను పోలింగ్‌స్టేషన్‌ల వారీగా విభజించి ఏ పోలింగ్‌స్టేషన్‌కు ఎన్ని బ్యాలెట్‌ పత్రాలు జారీ చేయాల్సి ఉందో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయిస్తారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లు ముద్రించిన తదుపరి ఆర్వో నియమించిన ఎన్నికల బృందాలు సెక్యూరిటీ పర్సనల్‌తో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎంచుకున్న వారి ఇంటికి ముందే తెలిపిన తేదీల్లో వెళ్లి ఎలా వేయాలో అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.


రహస్య ఓటింగ్‌కు భంగం కలగకుండా పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓటు హక్కు వినియోగించుకున్నాక నిర్దేశిత షీల్డ్‌ కవర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ను స్వీకరిస్తారని వెల్లడించారు.. పోలింగ్‌కు ముందు రోజు వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ బ్యాలెట్‌ బాక్సులను ఆర్వో వద్ద డిపాజిట్‌ చేస్తారని తెలిపారు. సర్వీస్‌ ఓటర్లకు అందించే పోస్టల్‌ బ్యాలెట్‌కు దీనికి సంబంధం లేదని, ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కావాలనుకున్న వారే సంబంధిత పత్రాలు నింపాల్సి ఉంటుందని కలెక్టర్‌  స్పష్టం చేశారు. అంతేకాకుండా కొవిడ్‌ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2020-10-12T10:52:04+05:30 IST