‘ఉపాధి’లో చెరువులను మరమ్మతు చేయించాలి

ABN , First Publish Date - 2020-06-18T11:06:06+05:30 IST

గ్రామాల్లోని చెరువులు, తూములు, ఫీడర్‌ ఛానెళ్లను మరమ్మతులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

‘ఉపాధి’లో చెరువులను మరమ్మతు చేయించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌


మెదక్‌ రూరల్‌, జూన్‌ 17: గ్రామాల్లోని చెరువులు, తూములు, ఫీడర్‌ ఛానెళ్లను మరమ్మతులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియ, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందరన్‌రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ గామ్రంలోని చెరువులు, తూములు, ఫీడర్‌ ఛానెళ్లను మరమ్మతు చేయించుకోవాలని, దీనికి గాను డీఆర్డీవో, ఇరిగేషన్‌ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎలా చేయాలనే విషయాలను నోట్‌ చేసుకొని అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు.


అలాగే గ్రామాల్లో ఉన్న వాటర్‌ ట్యాంకులు, కెనాల్‌ పనులకు సంబంధించిన  ప్రణాళికలను తయారు చేసి వాటికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనికి తోడు ప్రతి వారం జరిగే పనికి సంబంధించిన నగదు సైతం ఎప్పటికప్పుడే చెల్లించాలని కలెక్టర్లకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, నీటి పారుదలశాఖ ఈఈ యేశయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.     జిల్లాలో ఎక్కువగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయడానికి అధికారులు అందరూ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను అదేశించారు. దీనికి గాను డీఆర్‌డీవో, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతి గ్రామంలో ఉన్న పెండింగ్‌ పనులను గుర్తించాలని, వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. 


ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్‌ ధర్మారెడ్డి

జాతీయ ఉపాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నీటి పారుదల, జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆయా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ని చెరువులు, ఫీడర్‌ ఛానెళ్లు, తూములు, వాటర్‌ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా సమయంలో కూలీలు ఉపాధి హామీ పనులను ఎక్కువగా వినియోగించుకునేలా చూడాలన్నారు. తూములు, కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, మినీ ట్యాంకులు నిర్మాణం, ఫీడర్‌ ఛానెళ్లు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, చిన్ననీటి కాలువలు, సబ్‌ మైనర్‌ కాలువల నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. ఈ  సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఈఈ యేశయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T11:06:06+05:30 IST