చేర్యాల రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేనా !
ABN , First Publish Date - 2020-12-10T05:34:01+05:30 IST
సిద్దిపేట జిల్లా నేడు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చేర్యాల ప్రాంత ప్రజలు బోలెడన్ని ఆశలుపెట్టుకున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనుండగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారా... లేదా అన్న విషయమై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

సీఎం కేసీఆర్ సభపై ఆశలు
చేర్యాల, డిసెంబరు 9 : సిద్దిపేట జిల్లా నేడు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చేర్యాల ప్రాంత ప్రజలు బోలెడన్ని ఆశలుపెట్టుకున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనుండగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారా... లేదా అన్న విషయమై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా మద్దూరు మండలంలోని ధూల్మిట్ట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూనే అదే మండలంలోని అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాలను చేర్యాలలో విలీనం చేసి నాలుగు దశాబ్ధాల చిరకాలవాంఛను నెరవేర్చారు. ఈ క్రమంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి తమ ఆకాంక్షను సైతం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన చేర్యాల కాలక్రమేణా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో చిన్న మండలంగా మారి అస్తిత్వం కోల్పోయి అమాత్యుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నది.
మూడు మండలాలు తలో దిక్కు
నూతన జిల్లాల ఏర్పాటులో చేర్యాలను చీల్చి కొమురవెల్లి నూతన మండలాన్ని ఏర్పాటు చేశారు. రెండు మండలాలను రెవెన్యూపరంగా సిద్దిపేట ఆర్డీవో పరిధిలో చేర్చారు. మద్దూరు మండలాన్ని హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు. పోలీస్, ట్రాన్స్‌కో శాఖలను హుస్నాబాద్ డివిజన్ పరిధికి చేర్చి వ్యవసాయ శాఖను గజ్వేల్ డివిజన్‌కు చేర్చారు. ఇప్పటికే జిల్లా సిద్దిపేట, నియోజకవర్గం జనగామ, భువనగిరి పార్లమెంటు పరిధిలో కొనసాగుతుండటానికి తోడు డివిజన్‌ల విషయంలోనూ ఒక్కోశాఖను మూడేసి ప్రాంతాలకు కేటాయింపచేయడంతో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పడం లేదు. చేర్యాల మండలంలోని నాగపురి, షబాషీగూడెం, పెద్దరాజుపేట, వేచరేణి గ్రామాలు కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చేర్చారు. కానీ రెవెన్యూ పరంగా అనువైన చేర్యాలకు వెళుతుండగా, వివాదాలు, తగాదాలు, ఇతరత్రా సమస్యల పరిష్కారానికి కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌కు వెళుతూ వ్యయ,ప్రయాసలకు గురవుతూ ఇబ్బందులుపడుతున్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ హామీ
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, బూర నర్సయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పాటుపడతామని ప్రధానంగా హామీలు గుప్పించారు. ఈవిషయమై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేర్యాలలో దీక్షచేపట్టగా, మాజీ మంత్రి పొన్నాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సీఎం కేసీఆర్ మదిలో ఉందని, త్వరలో సాకారం కాబోతుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మునిసిపల్ ఎన్నికల సమయంలో ప్రకటించారు. అంతేకాకుండా మూడుమండలాల గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ప్రభుత్వానికి అందించినా కదలిక లేదు.