సభ్యులు లేక వెలవెలబోయినసంగారెడ్డి మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-12-29T05:21:46+05:30 IST

సంగారెడ్డి మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సభ్యులు లేక వెలవెల బోయింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు, అధికారులు లేక గంట ఆలస్యంగా 3 గంటలకు నిర్వహించారు.

సభ్యులు లేక వెలవెలబోయినసంగారెడ్డి మండల సర్వసభ్య సమావేశం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ లావణ్య దుర్గేష్‌

సమావేశానికి సర్పంచుల డుమ్మ


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 28 : సంగారెడ్డి మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సభ్యులు లేక వెలవెల బోయింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు, అధికారులు లేక గంట ఆలస్యంగా 3 గంటలకు నిర్వహించారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒక్క సర్పంచ్‌ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. 17 శాఖల మండల అధికారుల్లో కేవలం పది మంది అధికారులు మాత్రమే హజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య దుర్గేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తి స్థాయిలో రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సమావేశానికి కూడా అధికారులు రాకపోవడమేమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జడ్పీటీసీ సునీతామనోహర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో రైతు మృతి చెందాడని అతడి కుటుంబానికి రైతుబీమా వచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి ఏవీజీకే ప్రసాద్‌ను కోరారు. ఎంఈవో వెంకటనర్సింహాగౌడ్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా పాఠశాలలను తెరవాలనే విషయమై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎలాంటి తీర్మానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎంపీడీవో రవీందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ బాల్‌రాజ్‌, ఏవో ప్రసాద్‌, ఏపీఎం వెంకట్‌ వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:21:46+05:30 IST