ఏదీ దూరం ?

ABN , First Publish Date - 2020-04-07T10:59:59+05:30 IST

మహమ్మారి కరోనా వైర్‌సను తరిమికొట్టేందుకు ప్రజలు భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకర్లు ఏమీ పాటించడం లేదు.

ఏదీ దూరం ?

గుంపులుగుంపులుగా జనాలు

బ్యాంకుల వద్ద బారులు

సంగారెడ్డి జిల్లాలో బ్యాంకర్లపై కలెక్టర్‌ ఆగ్రహం

జోగిపేటలో ఖాతాదారులకు ఎమ్మెల్యే మందలింపు

మార్కెట్లు, రేషన్‌షాపుల వద్ద యథావిధిగా

భౌతిక దూరంను పట్టించుకోని ప్రజలు


మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సహా భౌతిక దూరం పాటించని సొసైటీ సిబ్బంది, నాయకులు


కరోనా కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత మొత్తుకుంటున్నా జనం ఖాతరు చేయడం లేదు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రేషన్‌ షాపులు వద్ద భౌతిక దూరం అమలైనప్పటికీ ప్రస్తుతం పాటించడం లేదు.


ప్రజలు యథావిధిగా వీధుల్లోకి సమూహాలుగా వచ్చి కార్యకలాపాలను నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలువురు నేతలతో సహా జనం ఎక్కడా భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాల్లో, కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబ్బు కోసం బ్యాంకుల వద్ద గుంపులుగా కనిపించారు. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 6 : మహమ్మారి కరోనా వైర్‌సను తరిమికొట్టేందుకు ప్రజలు భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకర్లు ఏమీ పాటించడం లేదు. ఫలితంగా సోమవారం జిల్లాలోని ఏ బ్యాంకు శాఖ వద్ద చూసినా భౌతిక దూరంకు బై చెప్పిన ఖాతాదారులు ఎప్పటిలాగే పదుల సంఖ్యలో నిల్చున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఎస్‌బీఐ శాఖ వద్ద ఖాతాదారులు బారులు తీరారు. వీరెవరూ భౌతికదూరం పాటించకపోగా, బ్యాంకర్లు కూడా దూరం పాటించాలని సూచించకపోవడం విచిత్రంగా ఉన్నది. ఇదే పరిస్థితి జిల్లాలోని అనేక ప్రాంతాలలో నెలకొన్నది. జోగిపేట, నారాయణఖేడ్‌లోని ఎస్‌బీఐ వద్ద, జిన్నారం ఏపీజీవీబీ శాఖ వద్ద, ఝరాసంగంలోని సిండికేట్‌ బ్యాంకు శాఖ వద్ద నెలకొని ఉండటాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బృందం గమనించింది.


సంగారెడ్డి ఎస్‌బీఐ వద్ద పదుల సంఖ్యలో ఖాతాదారులు బారులు తీరి ఉండడాన్ని అటుగా వెళ్తున్న కలెక్టర్‌ ఎం.హన్మంతరావు చూసి, తన వాహనంను ఆపారు. బ్యాంకులోకి వెళ్లి, ఖాతాదారులు ఇలా భౌతికదూరం పాటించకుండా బారులు తీరడం ఏమిటని కలెక్టర్‌ బ్యాంకర్లను ప్రశ్నించారు. ఖాతాదారులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు, ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి చెప్పారు. కరోనా కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత మొత్తుకుంటున్నా జనం ఖాతరు చేయడం లేదు.


లాక్‌డౌన్‌ ప్రారంభంలో కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రేషన్‌ షాపులు వద్ద భౌతిక దూరం అమలైనప్పటికీ ప్రస్తుతం పాటించడం లేదు. ప్రజలు యథావిధిగా వీధుల్లోకి సమూహాలుగా వచ్చి కార్యకలాపాలను నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలువురు నేతలతో సహా జనం ఎక్కడా భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాల్లో, కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబ్బు కోసం బ్యాంకుల వద్ద గుంపులుగా కనిపించారు. 


బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆగ్రహం

జోగిపేట : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ప్రధాన రహదారిగుండా వెళ్తుండగా జాతీయ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు శాఖ వద్ద పదుల సంఖ్యలో ఖాతాదారులు గుమిగూడడంతో వెంటనే క్రాంతికిరణ్‌ కారుదిగి బ్యాంకు వద్దకు వచ్చి ఖాతాదారులను మందలించారు. భౌతిక దూరం పాటించకుండా ఒకరిని ఒకరు తాకుతూ నిలబడడం ఎందుకు అంటూ మందలించారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌ సౌజన్యను పిలిచి ఖాతాదారులు అలా భౌతిక దూరం పాటించకుండా ఉంటే మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జోగిపేటలోని షాపుల వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. గిరాకీ పైనే ధ్యాస పెట్టిన దుకాణదారులకు భౌతిక దూరం పాటించాలన్న స్పృహ కొరవడింది.  


సిద్దిపేట జిల్లాలో యథావిధిగా

సిద్దిపేట : పోలీసులు తీవ్రంగా పరిగణించిన సందర్భాల్లో మాత్రమే జనం భౌతిక దూరంను పాటిస్తున్నారు. తర్వాత యథావిధిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా సిద్దిపేటలోని కూరగాయల మార్కెట్లు, రేషన్‌ షాపుల వద్ద ఒకటి రెండు రోజులు భౌతికదూరం అమలుచేశారు. తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, పోలీసులు కూడా ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి అందరికీ చెప్తున్నారు. తర్వాత జనం కరోనా భయం లేకుండానే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. 


నర్సాపూర్‌లో ఒకే చోట

నర్సాపూర్‌ : కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాలో వేసిన డబ్బు కోసం సోమవారం నర్సాపూర్‌లోని ఎస్‌బీఐ సేవా కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. దూరంగా నిల్చొవాలని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నా అవేవి పట్టించుకోకుండా ఒకేచోట బారులు తీరారు. పోలీసులు వారిని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రాన్ని బంద్‌ చేయించారు. 

Read more