రూటు మార్చిన జనాలు.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు..

ABN , First Publish Date - 2020-07-27T19:30:05+05:30 IST

కరోనా కలవరపెడుతున్న క్రమంలో ప్రజలంతా రోగనిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. కరోనా బారిన పడకముందే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహ అందరిలో మొదలైంది.

రూటు మార్చిన జనాలు.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు..

ఇమ్యూనిటే సేఫ్టీ.. రోగనిరోధక శక్తిపై ప్రజల దృష్టి

కరోనాను ఎదుర్కొనేలా జాగ్రత్తలు

పలు కషాయాల తయారీతో ఉపశమనం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట: కరోనా కలవరపెడుతున్న క్రమంలో ప్రజలంతా రోగనిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. కరోనా బారిన పడకముందే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహ అందరిలో మొదలైంది. మూడునెలల పాటు గ్రీన్‌జోన్‌లో ఉన్న సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 300 కేసులు నమోదు కావడంతో ఇమ్యూనిటే సేప్టీ మార్గం అంటూ ప్రజలు అప్రమత్తమయ్యారు.


కషాయాలకు తొలి ప్రాధాన్యం

ఒకప్పుడు కషాయం అంటేనే ఎడ ముఖంగా చూసేవారు. కానీ ప్రస్తుత పరిణామాల్లో కషాయం అనేది ప్రతీ ఇంట్లో కీలకంగా మారింది. ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా తయారు చేసుకుంటున్నారు. మిరియాలు, లవంగాలు, అల్లం, దాల్చినచెక్క, పసుపు, శొంటి, బెల్లం, ధనియాలు, తులసి ఆకులను ఉపయోగించి కషాయాలను సిద్ధం చేసుకొని సేవిస్తున్నారు. చాలా ఇళ్లలో టీ, కాఫీలకు బదులుగా కషాయాలనే పరిగడుపున సేవిస్తున్న పరిస్థితి నెలకొన్నది. రుచి లేకున్నా కష్టంగానైనా రోజుకు రెండుసార్లు తీసుకుంటున్నారు.


డ్రైఫ్రూట్స్‌, గుడ్లు, మాంసం, పండ్లకు గిరాకీ

బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, కిస్మిస్‌, అంజీర లాంటి డ్రైఫ్రూట్స్‌ నిన్నమొన్నటిదాకా ఉన్నత వర్గాల ఇళ్లకే పరిమితమయ్యాయి. కానీ రోగనిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు కూడా తమ ఆర్థిక స్థోమత ఆధారంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటున్నారు. ఇక కోడిగుడ్లకు ఫుల్‌ గిరాకీ పెరిగింది. ప్రతీరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తప్పనిసరిగా మారింది. పిల్లలకు గుడ్ల రూపంలోనే శక్తి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. వీటికితోడు చికెన్‌, మటన్‌, చేపలను వారానికి రెండు, మూడు సార్లు క్రమం తప్పకుండా తెచ్చుకుంటున్నారు. గతంలో కేవలం ఆదివారం మాత్రమే మాంసాహారానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ వారానికి ఐదు రోజులు కూడా మాంసం తింటున్నవారు ఉన్నారు. సీ-విటమిన్‌ లభించే నిమ్మ, దానిమ్మ, జామ, పైనాపిల్‌తోపాటు పోషకాలను అందించే ఆపిల్‌, అరటి, బత్తాయి పండ్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇక రోగనిరోధక శక్తికి ఉపకరించే కూరగాయలకూ గిరాకీ పెరిగింది. టమాట, బెండకాయ, క్యారెట్‌, కాకర, చిక్కుడు, పాలకూర, బచ్చలికూర, పుదీనాను ఎక్కువగా కొంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 


జిల్లాలో పెరిగిన కేసుల ఉధృతి..

కరోనా కట్టడి విషయంలో రెండు నెలల కిందట సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచింది. కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేత, వలస కార్మికుల రాకతో పరిస్థితి పూర్తిగా మారింది. మూడునెలల పాటు ఒకే కేసుకు పరిమితమైన ఈ జిల్లాలో ప్రస్తుతం 300 కేసుల మార్క్‌ దాటడం ఆందోళనను కలిగిస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం కూడా కేసుల ఉధృతికి కారణంగా నిలుస్తున్నది. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. అందుకే కేసుల తీవ్రతను బట్టి ఇంట్లోనే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


కరోనా రాకుండా కషాయమే రక్ష: పరశురాములు, శభాష్ గూడెం

కరోనా వచ్చేకంటే రాకుండా జాగ్రత్తపడడమే ముఖ్యం. అందుకే నేను అప్రమత్తమై ప్రతీరోజు కషాయాన్ని రెండుపూటలు సేవిస్తున్నాను. డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి ఉదయం పూట తింటున్నా. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను. మన ప్రాణం, ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువకాదని తెలుసుకున్నా. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే మంచిది. వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడడం కంటే ఇమ్యూనిటీ బలంగా ఉంటే అదే శ్రీరామరక్ష.

Updated Date - 2020-07-27T19:30:05+05:30 IST