కర్ఫ్యూకు జనం జేజేలు

ABN , First Publish Date - 2020-03-23T07:06:45+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ప్రజలు స్వచ్ఛందంగా పాటించిన...

కర్ఫ్యూకు జనం జేజేలు

  • గడపదాటని ప్రజలు
  • డిపోలకే పరిమితమైన బస్సులు
  • మూతపడిన పరిశ్రమలు
  • ముంబై నుంచి వచ్చినవారికి రాష్ట్రంలోకి నో ఎంట్రీ
  • సంగారెడ్డి కౌన్సిలర్‌పై కేసు నమోదు
  • చప్పట్లతో సంఘీభావం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి, 22: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ప్రజలు స్వచ్ఛందంగా పాటించిన జనతా కర్ప్యూ సంపూర్ణమైంది. సంగారెడ్డితో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. ప్రైవేట్‌ వాహనాలు సైతం తిరగలేదు. హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై మునిపల్లి మండలం కంకోల్‌ వద్ద ఉన్న టోల్‌గేట్‌ వెలవెలబోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నిటిని స్వచ్ఛందంగా మూసి వేశారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. అత్యవసర పనుల మీద రోడ్ల మీదకు వచ్చిన వారి వాహనాలను నిలిపి వివరాలు సేకరించిన తర్వాతే అనుమతించారు. పటాన్‌చెరు, పాషమైలారం బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లోని సుమారు 1500 చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మూసివేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌ పరిశ్రమలు కూడా పని చేయలేదు. జనతా కర్ఫ్యూకు మద్దతుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కొందరు గంటలు కొట్టారు. కలెక్టర్‌ ఎం.హన్మంతరావు కుటుంబ సభ్యులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో చప్పట్లు కొట్టారు. కల్హేర్‌ మండలం ఖానాపూర్‌లో ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి చప్పట్లు కొట్టారు. 


దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఝరాసంగం మండలం బర్దీపూర్‌లోని దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. దత్తగిరి పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్‌, భావి పీఠాధిపతి డాక్టర్‌ సిద్ధయ్యస్వామి ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది.


ఇంటింటికీ పాలు సరఫరా చేసిన సర్పంచ్‌ భర్త

కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా కల్హేర్‌ మండలం దేవినిపల్లిలో సర్పంచ్‌ సులోచన భర్త భూపాల్‌ ఇల్లిల్లు తిరిగి పాలు పోశారు. ప్రజలందరికి సరిపడా పాలు తీసుకున్న భూపాల్‌ మాస్క్‌ కట్టుకుని పాలు పోయడంపై ప్రజలు అభినందించారు. ప్రజలు తిరగకుండా ఉండేందుకు ఆయనొక్కడే ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఏపీ వాసులకు నో ఎంట్రీ

 ముంబై నుంచి ప్రైవేట్‌ బస్సులో వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి సమీప ప్రాంతాలకు చెందిన 39 మందిని జిల్లా సరిహద్దులోని చిరాక్‌పల్లి వద్ద పోలీసులు నిలిపివేశారు. ఉపాధి పనుల కోసం వీరందరూ ఖతర్‌, ఒమన్‌ వెళ్లారు. కాంట్రాక్టు ముగియడంతో ఖతర్‌ నుంచి 34 మంది, ఒమన్‌ నుంచి ఐదుగురు 20న బయల్దేరి 21న ముంబై వచ్చారు. విమానశ్రయంలో వీరికి వైద్యపరీక్షలు నిర్వహించిన ముంబై పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ వెళ్ల్లేందుకు అనుమతించారు. వీరందరూ వచ్చిన ప్రైవేట్‌ బస్సును జిల్లా సరిహద్దులో పోలీసులు నిలిపివేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి వారితో మాట్లాడి అనుమతి నిరాకరించారు. తెలంగాణలో జనతా కర్ఫ్యూ ఉన్నందున 23న ఉదయం 6 గంటల వరకు రానీయమని స్పష్టం చేయడంతో వారు సమీపంలోని కర్ణాటకలోని బొంగూరు గ్రామంలోని హోటళ్లకు వెళ్లారు. 


అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు

జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డిలోని 34వ వార్డు కౌన్సిలర్‌ మహమ్మద్‌ సమీతో పాటు మరో ఇద్దరు మహ్మద్‌ అరాఫత్‌, వాహెద్‌బీన్‌ అహ్మద్‌పై సంగారెడ్డి టౌన్‌ పోలీసులు కేసునమోదు చేశారు. 188 ఐపీసీ, 124ఏ, 153బీ, 505/2, రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్‌ సమీకి గతంలో మతపరమై అల్లర్లలో పాల్గొన్న నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు.


Updated Date - 2020-03-23T07:06:45+05:30 IST