పారిశ్రామికవాడల్లో లాక్‌డౌన్‌ పాక్షికం

ABN , First Publish Date - 2020-03-24T06:14:29+05:30 IST

ప్రభుత్వం కొనసాగించిన లాక్‌డౌన్‌ పటాన్‌చెరు పారిశ్రామికవాడలో పాక్షికంగా అమలైంది. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు...

పారిశ్రామికవాడల్లో లాక్‌డౌన్‌ పాక్షికం

  • పటాన్‌చెరులో పని చేసిన  పలు పరిశ్రమలు
  • జిన్నారం, గుమ్మడిదల పారిశ్రామిక వాడల్లో నిబంధనలకు తూట్లు
  • సరుకులు, పనుల కోసం   రోడ్లపైకి వచ్చిన ప్రజలు
  • చుక్కలనంటిన కూరగాయల ధరలు
  • లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ఇబ్బందులు పడిన పోలీసులు, అధికారులు 


పటాన్‌చెరు/జిన్నారం/గుమ్మడిదల, మార్చి 23: ప్రభుత్వం కొనసాగించిన లాక్‌డౌన్‌ పటాన్‌చెరు పారిశ్రామికవాడలో పాక్షికంగా అమలైంది. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు, మందులు కొనుగోలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పలుచోట్ల జనసంచారం కనిపించింది. కిరాణా దుకాణాలు, కూరగాయాల దుకాణాల వద్ద సందడి నెలకొంది. గుంపుగా ఉండకూడదని పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. మరో వారం పాటు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయంతో కొనుగోళ్ల కోసం పోటీ పడ్డారు. ఉగాది పండుగ సరుకు సైతం సోమవారం కొనుగోలు చేశారు. కిరాణా, మందులు, పాలు, కూరగాయల దుకాణాలు తప్ప మిగతా ఇతర వ్యాపార కేంద్రాలను తెరవలేదు. పారిశ్రామిక వాడలో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన పరిశ్రమలు తప్ప ఇతర పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి.  రాష్ట్ర సరిహద్దులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డును మూసివేయడంతో ఇతర ప్రాంతాలనుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  జిన్నారంలో ప్రజలు తెలంగాణ లాక్‌డౌన్‌ పట్ల మిశ్రమంగా స్పందించారు. పరిశ్రమలు ఏకంగా తూట్లు పొడిచాయి.  జిన్నారంలో ఉదయం కొద్ది సేపు దుకాణాలు తెరిచి ఉంచగా స్థానికులు సరుకులు కొనుగోలు చేశాక పోలీసులు షాపులు మూసి వేయించారు.గుమ్మడిదల మండలంలో జనతా కర్ఫ్యూకి సంపూర్ణంగా సహకరించిన ప్రజలు రెండో రోజు లాక్‌డౌన్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సోమవారం గుమ్మడిదల మండలం కేంద్రంతో పాటు పలు పారిశ్రామికవాడలు గ్రామాల్లో ప్రజలు రోడ్లపై మామూలుగా రాకపోకలు సాగించారు.  పరిశ్రమల్లో ఉత్పత్తి కొనసాగింది.


కొండెక్కిన కూరగాయల ధరలు

జనతాకర్ఫ్యూ నేపఽథ్యంలో పటాన్‌చెరులో కూరగాయల ధరలు కొండెక్కాయి. వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడం కనిపించింది.  బీరంగూడా కమాన్‌ వద్ద కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నవారితో కొనుగోలుదారులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. బీరంగూడలో సోమవారం జరిగే వారాంతపు సంతతో పాటు ఈ ప్రాంతంలో రోజుకో చోట జరిగే సంతలను మూసివేశారు. నిబంధనలను ధిక్కరించి వాహనాల్లో తిరుగుతున్న వారిపై ట్రాఫిక్‌ పోలీసులు పెద్ద ఎత్తున చలాన్లను విధించారు. 


జిన్నారంలో లాక్‌డౌన్‌కు తూట్లు

కరోనా నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా.. పారిశ్రామిక వాడలలో జనం, కార్మికుల సంచారం కనిపించింది. గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఎక్కువగా ఉన్న ఫార్మా పరిశ్రమలను నడిపించటంతో విధుల కోసం కార్మికులు ఉదయాన్నే వచ్చారు. చాలా వరకు ఫార్మాయేతర పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలు ఉత్పాదనలు చేపట్టారు. ఇక పరిశ్రమలకు లాక్‌డౌన్‌ వర్తింపు విషయంలో సరైన సమాచారం లేక పోవడంతో వందల సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాగా పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. 


Updated Date - 2020-03-24T06:14:29+05:30 IST