ఓపీ నిల్..ప్రత్యేక కేసులకే పరిమితం
ABN , First Publish Date - 2020-04-07T11:02:20+05:30 IST
కరోనా ఎఫెక్ట్ సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపైనా పడింది. చాలా ఆస్పత్రుల వారు రోగులను చూడటం

కరోనా ప్రభావంతో ప్రైవేటు ఆస్పత్రులకు తాళం
ప్రసవాల కేసులు ప్రభుత్వాసుపత్రికే
సాధారణ చికిత్సలకు ఆర్‌ఎంపీలే దిక్కు
సిద్దిపేట, ఏప్రిల్ 6: కరోనా ఎఫెక్ట్ సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపైనా పడింది. చాలా ఆస్పత్రుల వారు రోగులను చూడటం మానేసి ఆస్పత్రులకు తాళాలు వేశారు. రోగులు ప్రభుత్వాసుపత్రులు, లేదా ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు వెళ్తున్నారు. ప్రైవేటు నర్సింగ్‌హోంలలో ప్రసూతి కేసులు కూడా తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిసంఖ్య పెరిగింది.
సిద్దిపేట జిల్లాలో ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు నిర్వహించే ప్రైవేటు నర్సింగ్‌హోంలు 80, ప్రైవేటు క్లినిక్‌లు 30కి పైగా ఉంటాయి. కంటి, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, గైనిక్ స్పెషలిస్టులు, సీనియర్ డాక్టర్లు నిర్వహించే ఆస్పత్రులలో రోజుకు సుమారు 70నుంచి వంద మంది దాకా ఔట్‌పేషెంట్లు వస్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులకు తాళాలు వేశారు. అప్పటికే ఇన్‌పేషంట్లుగా ఉన్న వారికి, అత్యవసర కేసులకు మాత్రమే చికిత్స చేస్తామని ప్రకటించారు. దాదాపు కరోనా భయంతో జిల్లా కేంద్రం సిద్దిపేటతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు మొత్తం మూతపడ్డాయి.
మాస్కులు ధరించి వస్తేనే
సిద్దిపేటజిల్లాలో చాలా మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తమ వద్దకు వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని సూచిస్తున్నారు. మాస్కులు వేసుకోకుండా వస్తే చూడడానికి నిరాకరిస్తున్నారు. కరోనా వైరస్ భయం మొదలైన నాటినుంచి ఆర్‌ఎంపీల ప్రాక్టీసు పెరిగిందని సమాచారం. కరోనా ఎఫెక్ట్‌తో స్పెషలిస్టులు అందించాల్సిన సేవలకు మాత్రం విఘాతం కలుగుతున్నది.
ప్రభుత్వ ఆస్పత్రులలో పెరిగిన ప్రసవాలు
జిల్లాలోని ప్రైవేటు నర్సింగ్‌హోంలలో రెగ్యూలర్‌గా వచ్చే గర్భిణులకు మాత్రమే ప్రసవాలు చేస్తున్నారు. అది కూడా కొద్ది మంది గైనిక్ డాక్టర్లే కేసులు తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సమానంగా జరిగే డెలివరీల సంఖ్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి జిల్లాలోని ప్రైవేటు నర్సింగ్‌హోంలలో 55 ప్రసవాలు జరిగినట్లు వైద్యఆరోగ్యశాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 333 డెలివరీలు జరగ్గా సిద్దిపేట ఆస్పత్రిలో 207, గజ్వేల్‌లో 96, దుబ్బాకలో పది, చేర్యాలలో ఒకటి, పీహెచ్‌సీలలో 19 ప్రసూతి కేసులు నమోదయ్యాయి. నార్మల్ డెలివరీలు మాత్రమే పీహెచ్‌సీలలో చేయగా ఆపరేషన్ కేసులు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో జరిగాయని సమాచారం.
ఆసుపత్రికి అర్హత లేకున్నా చిన్నారులకు వైద్యం..ఆకస్మిక తనిఖీలో వెల్లడి
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని విష్ణు ఆసుపత్రిని సోమవారం సాయంత్రం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ విజయనిర్మల, మండల వైద్యాధికారి విజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేకున్నా చిన్నారులకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించినట్లు విజయనిర్మల పేర్కొన్నారు. ఆసుపత్రిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్లకు వైద్య సేవలు అందించకూడదని సూచించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ కేంద్రాలను తెరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీఎంఅండ్‌హెచ్‌వో ఆదేశం.. ఆసుపత్రుల మూసివేత
రామాయంపేట : రామాయంపేట మండలంలో ప్రథమ చికిత్సాలయా లు మూతపడ్డాయి. జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో సోమవారం నుంచి సేవలను బంద్ చేశారు. భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రతల కోసమే జిల్లా వైద్యాధికారి క్లీనిక్ కొద్దిరోజులు మూసి వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.