లాక్‌డౌన్‌తో ఉల్లి రైతు విలవిల!

ABN , First Publish Date - 2020-04-26T10:14:15+05:30 IST

లాక్‌డౌన్‌.. ఉల్లి రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలో సాగు చేసిన ఉల్లి నిల్వలు వ్యవసాయ క్షేత్రాల్లోనే

లాక్‌డౌన్‌తో ఉల్లి రైతు విలవిల!

పంట చేల వద్ద పేరుకుపోతున్న ఉల్లి నిల్వలు

ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల విన్నపం


అల్లాదుర్గం, ఏప్రిల్‌ 25: లాక్‌డౌన్‌.. ఉల్లి రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలో సాగు చేసిన ఉల్లి నిల్వలు వ్యవసాయ క్షేత్రాల్లోనే పేరుకుపోతున్నాయి. మండలంలో సాగునీటి వసతి లేకపోవడంతో అత్యధిక రైతులు బోర్లపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తుంటారు. రైతులు ఆరుతడి పంటలపై ఆసక్తి కనబరుస్తూ మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఉల్లి పంటను సాగుచేశారు. ఈ రబీ సీజన్‌లో వంద ఎకరాల మేరకు ఉల్లి పంటను సాగు చేశారు. ప్రకృతి కరుణించి, ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో రైతులు ఆనందించారు.


కానీ, కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు ఉల్లి విక్రయాల కోసం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు మార్కెట్లకు తరలిస్తారు. ప్రస్తుతం మార్కెట్లు మూత పడడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సంతలు కూడా జరుగకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద పేరుకుపోయిన ఉల్లి నిల్వలతో పంట దెబ్బతింటుండుడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-04-26T10:14:15+05:30 IST