అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2020-08-20T11:40:50+05:30 IST

సిద్దిపేట పట్టణంలో భవన నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అధికారులు హెచ్చరిస్తున్నా కనీస నిబంధనలు పాటించకుండా

అంతా మా ఇష్టం!

పట్టణంలో ఇష్టారీతిన భవన నిర్మాణాలు

మాస్టర్‌ ప్లాన్‌ మేరకు అనుమతులిచ్చినా సెట్‌బ్యాక్‌ వదలని యజమానులు

నిబంధనలకు తిలోదకాలు, పార్కింగ్‌ స్థలం కూడా ఉండదు

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు


సిద్దిపేట సిటీ, ఆగస్టు 19: సిద్దిపేట పట్టణంలో భవన నిర్మాణాలు యథేచ్చగా  కొనసాగుతున్నాయి. అధికారులు హెచ్చరిస్తున్నా కనీస నిబంధనలు పాటించకుండా ‘‘అంతా మా ఇష్టం’’ అన్నట్లుగా యజమానులు వ్యవహరిస్తున్నారు. కరోనా విపత్తులో హమాలీలు దొరక్కపోవడం, లాక్‌డౌన్‌లో కొంతమేర నిలిచిన పనులను, మధ్యలో వదిలేసిన భవనాలు, కొత్తగా నిర్మిస్తున్న భవనాలు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు. సెట్‌బ్యాక్‌ వదలకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రాకపోవడంతో పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయి. సిద్దిపేట పట్టణంలో అన్ని భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. భవన నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా లైసెన్స్‌ సర్వేయర్‌ ఇచ్చిన ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం చేపట్టాలి. కానీ పట్టణంలో భూమి రేట్లు అమాంతం పెరగడంతో గజం భూమికి కూడా విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో యజమానులు కొంచెం కూడా ఖాళీ వదలకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. లైసెన్స్‌ సర్వేయర్‌ ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం కాకుండా వారి సొంతంగా కనీసం సెట్‌బ్యాక్‌ స్థలం మిగల్చకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.


పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి చేరడంతో అక్కడ భూములున్నవారు డబ్బు సంపాందించాలనే నెపంతో తక్కువ స్థలంలో ఎక్కువ షెటర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం వాహనాలు నిలిపేందుకు స్థలం కూడా ఉండడం లేదు. అలాగే  సిద్దిపేట పట్టణం దినాదినాభివృద్ధి చెందుతుండడంతో నివాసయోగ్యాల కోసం అపార్ట్‌మెంట్లు పుట్టుకొస్తున్నాయి. పట్టణంలో చాలా అపార్ట్‌మెంట్లకు సరైన రోడ్డు మార్గం కూడా ఉండడం లేదు. అంతకు ముందున్న ఇళ్ల నిర్మాణాల నిబంధనల అతీతంగా కడుతుండడంతో రోడ్డు వెడల్పు తగ్గుతుంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక బైక్‌ వెళితే రెండో బైక్‌ పట్టడానికి స్థలం ఉండడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఇలాగే కొనసాగితే భవిషత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.  మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా వంద గజాలు దాటితే పది ఫీట్ల వరకు సెట్‌బ్యాక్‌ను వదిలివేయాలి. చుట్టూ 5 ఫీట్ల వరకు వదిలి భవన నిర్మాణాలు చేపట్టాలి. వాణిజ్యపరంగా, పరిశ్రమలు, కళాశాలలు పెరగడంతో ప్రధానమైన ప్రాంతాల్లో ఎవరూ సెట్‌బ్యాక్‌ను వదలడం లేదు. కొందరు వారి పలుకుబడితో పైరవీలు చేయించుకుంటున్నట్లు సమాచారం. 


రోడ్లపైకి వస్తున్న భవన నిర్మాణాలు

 భవన నిర్మాణం చేసిన వారు సెల్లార్‌తో పాటు సెట్‌బ్యాక్‌లను వదిలేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలరీత్యా వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అనుమతులు ఇచ్చినా ఆ తర్వాత తనిఖీలు చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రుల వద్ద ఎప్పుడైనా అగ్నిప్రమాదం జరిగితే అత్యవసర సేవల నిమిత్తం వాహనాలు నిలిపే స్థలం కూడా ఉండడం లేదు.సంబంధిత అధికారులు భవన నిర్మాణాలపై దృష్టి సారించి సరైనా సెట్‌బ్యాక్‌ వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Read more