రిజిస్ట్రేషన్లకు కొర్రీలు

ABN , First Publish Date - 2020-12-15T05:37:30+05:30 IST

ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ర్టేషన్ల పాలిట కొత్త సాఫ్ట్‌వేర్‌ శాపంగా మారింది. ధరణి పేరిటనే ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు సహకరించడం లేదు. ఇందులోని పలు నిబంధనలు లావాదేవీలకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. స్లాట్లను బుకింగ్‌ చేయడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇక రిజిస్ట్రేషన్ల సంగతి దేవుడెరుగు.

రిజిస్ట్రేషన్లకు కొర్రీలు
రిజిస్ర్టేషన్లు కాకపోవడంతో సిద్దిపేట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోతున్న క్రయవిక్రయదారులు

స్లాట్ల బుకింగ్‌కు సహకరించని సాఫ్ట్‌వేర్‌ 

టీపీఐఎన్‌ నంబర్‌ ఉంటేనే ఇంటి రిజిస్ర్టేషన్‌

వీఎల్‌టీ పన్ను కడితేనే స్థలం అమ్మకం 

జాయింట్‌ లావాదేవీలకు నో పర్మిషన్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 14 : ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ర్టేషన్ల పాలిట కొత్త సాఫ్ట్‌వేర్‌ శాపంగా మారింది. ధరణి పేరిటనే ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు సహకరించడం లేదు. ఇందులోని పలు నిబంధనలు లావాదేవీలకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. స్లాట్లను బుకింగ్‌ చేయడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇక రిజిస్ట్రేషన్ల సంగతి దేవుడెరుగు.

సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల, దుబ్బాక ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం నుంచి ఇక్కడ వ్యవసాయేతర స్థలాలు, ఇళ్ల రిజిస్ర్టేషన్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నూతన సాఫ్ట్‌వేర్‌ సమస్యతో ఆరు కార్యాలయాల్లో కలిపి కేవలం మూడు రిజిస్ర్టేషన్లే పూర్తయ్యాయి. ఈ మూడు కూడా దుబ్బాక కార్యాలయ పరిధిలోని ఇళ్లకు సంబంధించినవి కావడమే గమనార్హం. 


కొత్త సాఫ్ట్‌వేర్‌తో కటకట

వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ర్టేషన్‌ చేయడానికి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇటు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల ఉద్యోగులు, అటు డాక్యుమెంట్‌ రైటర్లు, క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో డాక్యుమెంట్‌ను రిజిస్ర్టేషన్‌ చేయడం కోసం పలు ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో వివరాలు, స్కానింగ్‌  చేసిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. స్లాట్‌ బుక్‌ చేయడం కూడా గగనంగా మారింది. 

-ఎల్‌ఆర్‌ఎస్‌ చేయబడిన నివాసిత స్థలాలను కూడా విక్రయించాలంటే వీఎల్‌టీ(వేకెన్సీ ల్యాండ్‌ ట్యాక్స్‌) చెల్లించిన పత్రం ఉండాలి. దీనిని తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేస్తేనే స్లాట్‌ బుక్‌ అవుతున్నది. 

-ఇళ్లను రిజిస్ర్టేషన్‌ చేయించాలంటే టీపీఐఎన్‌ నంబర్‌(తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌)ను ఆప్షన్‌లో పొందుపరిచారు. ఇది ఆయా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల ద్వారా పొందవచ్చు. ఈ నంబర్‌ నమోదు చేయనిదే స్లాట్‌ బుక్‌ కావడం లేదు. ఒకవేళ అయినా రిజిస్ర్టేషన్‌ సమయంలో బ్రేక్‌ పడుతున్నది. 

-ఒక డాక్యుమెంట్‌ ఇద్దరు, ఆపై సంఖ్యలో జాయింట్‌ రిజిస్ర్టేషన్‌ అయ్యి ఉంటే కేవలం ఒక్కరి వివరాలు మాత్రమే నమోదు చేసేలా ఆప్షన్లు ఉన్నాయి. ఉదాహరణకు సిద్దిపేట శివారులో 2 ఎకరాల వ్యవసాయేతర భూమి ఆరుగురి పేరిట ఉంది. వేరే ఒక్కరికి ఇదంతా రిజిస్ర్టేషన్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఆరుగురికి బదులు ఒక్కరి నుంచే రిజిస్ర్టేషన్‌ చేయాలనే విధంగా ఆప్షన్‌ ఉంది. 

-ఇక ఆస్తుల మార్టిగేజ్‌కు ఈ సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా సహకరించడం లేదు. 

-స్లాట్‌ బుక్‌ చేసుకొని ఏవైనా పొరపాటు దొర్లితే రిజిస్ర్టేషన్‌ సమయంలో కూడా వీటిని సవరించే అవకాశం లేదన్నట్లు పలు కార్యాలయాల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. 


వద్దు బాబోయ్‌ అంటూ..

వ్యవసాయేతర రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయనే సంతోషం క్రయవిక్రయదారుల్లో ఎక్కువ సేపు నిలవలేదు. ఆతృతగా స్లాటు బుక్‌ చేసుకోవాలని ఆరాటపడ్డా ఫలితం లేకపోయింది. కొత్త కొత్త ఆప్షన్లు, అర్థంకాని నిబంధనలతో పీఠముడి పెట్టారంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు టీపీఐఎన్‌ నంబర్లు, వీఎల్‌టీ ట్యాక్స్‌ల కోసం మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన వారంతా నిబంధనలను చూసి వద్దు బాబోయ్‌ అంటూ తిరుగు పయనమయ్యారు. డాక్యుమెంట్‌ రైటర్లకు కూడా అంతుబట్టకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ ఉండడంతో ముందడుగు వేయడం లేదు. 


Updated Date - 2020-12-15T05:37:30+05:30 IST