సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్‌వన్
ABN , First Publish Date - 2020-08-12T11:01:22+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు

రామాయంపేట, ఆగస్టు 11: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల పరిధిలోని డి ధర్మారంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి రూ.1.64 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలోనూ నీరు నిల్వ ఉండేలా ప్రతీ చెరువుకు కాల్వల ద్వారా నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు.
ఈ సారి రాష్ట్రంలో 80 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదులుతున్నట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను అమలుచేస్తూ అన్నివర్గాలను ఆదరిస్తున్నదని పేర్కొన్నారు. అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ప్రతీ పీహెచ్సీలో పరీక్షలు చేస్తున్నారని, అనుమానమున్న ప్రతీ ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, మండల పరిషత్ వైస్ చైర్మన్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.