పచ్చిమిర్చి రూ.160, టమాట రూ.80 ?

ABN , First Publish Date - 2020-03-24T06:07:05+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌ కూరగాయలపై పడింది. కరోనా వైరస్‌ మన దరికి చేరకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు...

పచ్చిమిర్చి రూ.160, టమాట రూ.80 ?

  • కూరగాయల ధరలకు రెక్కలు 
  • లీటర్‌ పాల ధర రూ.100 ఫ ఇబ్బడిముబ్బడిగా లాక్‌డౌన్‌ రేట్లు  
  • పట్టించుకోని అధికార యంత్రాంగం 
  • ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వేడుకోలు


సంగారెడ్డి రూరల్‌. మార్చి 23 : కరోనా ఎఫెక్ట్‌ కూరగాయలపై పడింది. కరోనా వైరస్‌ మన దరికి చేరకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకే రోజులో నిత్యావసర వస్తువుల ధరలను ఒకింటికి పదిరెట్లు అమాంతంగా పెంచేశారు. దీంతో కూరగాయలు కొనేందుకు వెళ్లిన ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు రూ.10కి కిలో పలికిన టమాట మార్కెట్‌లో కనిపించకుండా పోయింది. దాని ధరను వ్యాపారులు అమాంతంగా పెంచేసి కిలో టమాటను రూ.80కి విక్రయిస్తున్నారు.


లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ప్రజలకు నిత్యావసర వస్తువులైన పాలు, చక్కర, కూరగాయల ధరలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో చేసేది లేక కొనలేక తలలు పట్టుకుంటున్నారు. ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దికొద్దిగా అవసరం మేరకు కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. రెండురోజులకు ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 


క్ర.సం వస్తువులు 1కిలో  పాతధర ప్రస్తుతం

1. పాలు     1లీ రూ.50 రూ.60

2. చక్కర        1కిలో రూ.40 రూ.45 

3. పచ్చిమిరుప 1కిలో రూ.30 రూ.160

4. ఉల్లిగడ్డ     1కిలో రూ.25 రూ.90 

5. టమాట 1కిలో రూ.10 రూ.80

6. బీరకాయ 1కిలో రూ.30 రూ.80

7. ఆలుగడ్డ 1కిలో రూ.40 రూ.70

8. వంకాయ 1కిలో రూ.30 రూ.60

9. బెండకాయ 1కిలో రూ.40 రూ.80

10. క్యాబేజి పెద్దది     రూ.20         రూ.30

11. క్యాబేజి చిన్నది    రూ.10      రూ.20

12. క్యాబేజి పెద్దది     రూ.25      రూ.40 (గోబి)

13. క్యాబేజి చిన్నది    రూ.20     రూ.30

14. క్యాప్సికం 1కిలో   రూ.60      రూ.90

15. గోల్డ్‌ డ్రాప్‌ ఆయిల్‌   రూ.98        రూ.110 (లీటరు)


నిత్యావసర వస్తువులైన పాలు, చక్కర, కూరగాయల ధరలతో పాటు పప్పు దినుసులపై కూడా కిలోకి రూ.10 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఆర్థికంగా ఉన్న ప్రజలు అధిక ధరలు వెచ్చించైనా కొనుగోలు చేస్తుండగా.. పేదరికంలో ఉన్నవారు నిత్యావసర వస్తువులను కొనలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినందున వ్యాపారులు నిత్యావసర వస్తువులను పెంచి మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ నిత్యావసర వస్తువుల ధరలను కట్టిడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను నియంత్రించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ధరలను కట్టడి చేయాలి

లాక్‌డౌన్‌ ఉన్నదని కూరగాయల ధరలను పెంచడం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నం. చేసేది లేక ధరలు ఎక్కువైనా కొంటున్నం. ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు కట్టడి చేయాలి. ఇలాగే కొన్నిరోజులు ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి.

- వీరమణి, సంగారెడ్డి


అని రేట్లు పెరిగినయ్‌

కూరగాయలతో పాటు అన్ని రేట్లు పెరిగినయ్‌. ఏది కొనాలన్నా ఎక్కువగానే చెబుతున్నారు. లాక్‌డౌన్‌లో ఎక్కువ ధరలు విక్రయించవద్దని సీఎం చెప్పినా వ్యాపారులు అధిక రేట్టకే అమ్ముతున్నారు. తప్పని పరిస్థితిలో ఎక్కువ ధరలకైనా కొంటున్నాం. రేట్లు తగ్గించాలి.

- ఇర్ఫాన్‌, సంగారెడ్డి


కొరత వల్లే ధరలు పెంచారు 

కూరగాయల కొరత వల్లే తమకు కూరగాయల ధరలను ఎక్కువ రేట్లకు ఇచ్చారు. తమకు వచ్చిన ధరలను బట్టి తాము విక్రయిస్తున్నాం. తాము కావాలని కూరగాయల ధరలను పెంచలేదు. ఈ ధరలు రెండు మూడురోజుల వరకు మాత్రమే ఉంటాయనుకుంటున్నాం. కూరగాయలల ధరలు మళ్లీ తగ్గిపోతాయి. 

- అబ్దుల్‌ ముస్తఫా, వ్యాపారి


Read more