తలాపున మంజీరా.. అయినా ఇసుక కొరత

ABN , First Publish Date - 2020-03-02T11:38:19+05:30 IST

జిల్లాలో ఇసుక కొరత తీవ్రతరమైంది. ఇసుక పంపిణీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలులో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడంతో సంక్షభం

తలాపున మంజీరా.. అయినా ఇసుక కొరత

  • కాళేశ్వరం వద్ద మూతపడిన రీచ్‌లు
  • స్టాక్‌ పాయింట్‌లో నిండుకున్న నిల్వలు
  • నెలరోజులుగా మూసివేత
  • నిలిచిపోయిన ఆన్‌లైన్‌ బుకింగ్‌
  • జిల్లాలో తొలిసారి సర్దనలో ఇసుక రీచ్‌
  • మరోవారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ 

మెదక్‌: జిల్లాలో ఇసుక కొరత తీవ్రతరమైంది. ఇసుక పంపిణీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలులో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడంతో సంక్షభం తలెత్తే పరిస్థితి నెలకొంది. రెండు దశాబ్దాలుగా మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపుపై నిషేధం కొనసాగుతోంది. దొంగచాటుగా ఇసుక తరలింపును అరికట్టడానికి 


తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమలు చేస్తున్నది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుంటే నేరుగా వినియోగదారుడి ఇంటికే ఇసుకను పంపించాలనేదే ప్రభుత్వ యోచన. తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మెదక్‌లో ఇసుక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరు నెలలుగా జిల్లాలో ప్రభుత్వ ఇసుక డిపో నుంచి గృహ నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం నుంచి ఇసుకను జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. సన్న ఇసుక ధర టన్నుకు రూ.2,100, దొడ్డు ఇసుక ధర టన్నుకు రూ. 1,160 చొప్పున స్టాక్‌పాయింట్‌లో విక్రయించారు. 


నిలిచిపోయిన  దిగుమతులు


కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో సుమారు 23 ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌ ముంచెత్తడంతో ఇసుక రీచ్‌లకు దారులు మూసుకుపోయాయి. పెద్దపల్లి, మల్లారం ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే వివిధ జిల్లాలకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడినంత సరఫరా లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రమైంది. 


అధికారుల సమన్వయ లోపం


అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఇసుక కొరత తలెత్తుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం జలాలు రీచ్‌లను ముంచకముందే ఇసుకను నిల్వకేంద్రాలకు తరలించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని వారంటున్నారు. జిల్లాకు 50వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక అవసరం కాగా ఇప్పటి వరకు 23వేల క్యూబిక్‌మీటర్లు మాత్రమే అధికారులు దిగుమతి చేశారు. నెల రోజులుగా ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో విక్రయ కేంద్రాన్ని మూసివేసారు.  


విస్తరించిన ఇసుక మాఫియా


గృహ నిర్మాణ రంగంలో ఇసుక ప్రధాన పాత్రపోషిస్తుంది. కొరత వేధిస్తుండడంతో ఇసుక మాఫియా విచ్చలవిడిగా విస్తరించింది. ఇసుక పంపిణీ ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న తరుణంలో అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోవడంతో మాఫియా ఎగరేసుకుపోతోంది. సాండ్‌సేల్స్‌ మానిటరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పేరిట పోర్టల్‌ను రాష్ట్ర ఖనిజాభివృది ్ధశాఖ రూపొందించింది. ఈ పోర్టల్‌ ద్వారా ఇసుక వనరుల అన్వేషణ నుంచి మొదలుకొని జరుగుతున్న దోపిడీని అరికట్టడం వరకు అన్ని స్థాయిలలో పకడ్బందీగా పారదర్శకంగా ఉండేవిధంగా ఎస్‌ఎ్‌సఎంఎంఎస్‌ పోర్టల్‌ను తీర్చిదిద్దారు. దీంతో పాటు రెవెన్యూ, ఆర్టీవో, పోలీస్‌ చెక్‌పోస్టులను అనుసంధానిస్తూ ఇసుక పంపిణీని రూపొందించారు. ప్రభుత్వమే ఒక క్యూబిక్‌ మీటర్‌(లారీ లోడ్‌లో 13 క్యూబిక్‌ మీటర్లు ఉంటుంది) ఇసుకను రూ.600గా నిర్దారించింది. వే బిల్‌ నంబర్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జారీ చేస్తున్నారు. ఇసుక అవసరం ఉన్నవారు తమ పేరు, స్టాక్‌ యార్డు నంబరు, ఏరోజు ఇసుకను తీసుకుపోవాలో ప్రదేశం, లారీ నంబరు, ఛాసిస్‌ నంబరు, లారీ వెళ్లే మార్గం పేర్కొంటూ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా రెవెన్యూ ఆర్టీవో, పోలీసు, చెక్‌పోస్టు, గనులశాఖ, విజిలెన్స్‌ల పర్యవేక్షణలో కొనసాగుతుంది. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన లారీకి రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తున్నారు. అయినా ఇసుక మాఫియా అధికారుల కళ్లుగప్పి దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో వాగులు, వంకల నుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో తరలిస్తున్నారు. 

Updated Date - 2020-03-02T11:38:19+05:30 IST