పరిశ్రమల్లో భద్రత డొల్ల

ABN , First Publish Date - 2020-12-14T04:24:32+05:30 IST

పరిశ్రమలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పదిహేను రోజుల వ్యవధిలోనే సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో మూడు ప్రమాదాలు సంభవించాయి. చిన్నా, మధ్య తరహా కర్మాగారాలతో పాటు పేరెన్నిక గల పరిశ్రమలలోనూ ప్రమాదాలు వాటిళ్లుతుండడంతో ఫ్యాక్టరీలు తీసుకుంటున్న భద్రతా చర్యల డొల్లతనం ఏమిటో అర్థమవుతున్నది. రక్షణ అంశాలను పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనపడుతుంది.

పరిశ్రమల్లో భద్రత  డొల్ల
గడ్డపోతారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో ఎగిసిపడుత్ను మంటలు (ఫైల్‌)

కనీస రక్షణ చర్యలు శూన్యం

ఏడాదిలో 18 ప్రమాదాలు.. 11 మంది మృతి

నామమాత్రంగా అధికారుల తనిఖీలు 

దూరంగా సేఫ్టీ అధికారి కార్యాలయాలు

అగ్నిమాపక కేంద్రం లేక అధికంగా ప్రాణ, ఆస్తి నష్టం


జిన్నారం డిసెంబరు 13 : పరిశ్రమలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పదిహేను రోజుల వ్యవధిలోనే సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో మూడు ప్రమాదాలు సంభవించాయి. చిన్నా, మధ్య తరహా కర్మాగారాలతో పాటు పేరెన్నిక గల పరిశ్రమలలోనూ ప్రమాదాలు వాటిళ్లుతుండడంతో ఫ్యాక్టరీలు తీసుకుంటున్న భద్రతా చర్యల డొల్లతనం ఏమిటో అర్థమవుతున్నది. రక్షణ అంశాలను పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనపడుతుంది.

గత నెలలో సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పరిధిలోని ఓ పేరున్న గ్రూప్‌ ఆఫ్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలటంతో మగ్గురు కార్మికులు గాయపడ్డారు. బొంతపల్లి పరిధిలోని ఓ టైర్ల రీ ప్రాసెస్‌ యూనిట్‌లో పేలుడు సంభవించింది. తాజాగా ఈ నెల 12న బొల్లారం వింద్యా ఆర్గానిక్స్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఏడాదిగా పటాన్‌చెరు పరిధిలోని పారిశ్రామిక వాడల్లో జరిగిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడ్డపోతారం పరిధిలో 6, బొల్లారం 8, బొంతపల్లి 2, కాజీపల్లి పరిధిలో 2 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 11 మంది మరణించగా, 74 మంది గాయపడ్డరు. ఇవన్నీ అధికారికంగా నమోదు అయిన కేసులు కాగా బయటకు పొక్కని ప్రమాదాలు వందల సంఖ్యలో ఉంటాయనే ఆరోపణపలున్నాయి. ఇలా వరుస ప్రమాదాలు, రియాక్టర్ల పేలుళ్లతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు, సమీప గ్రామాల వారికి భద్రత పై ఆందోళన వ్యక్తమౌతోంది. 


కార్మికులకు రక్షణ కరువు

పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరటం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవటం.. నైపుణ్యం గల కార్మికులను వినియోగించకపోవటం అధిక ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణలైన కార్మికులు పనులు చేయాల్సి ఉన్న.. కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించక పోవటం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారిచటంలో విఫలం కావటంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించటం.. కొన్నిమార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా చాలా పరిశ్రమల సమీపంలో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్య లేక నగరానికి చేరేలోపు కొందరు మరణించిన ఘటనలు ఉన్నాయి. 


పరిశ్రమలు ఇక్కడ.. అధికారులు ఎక్కడో

మండల పరిశ్రమలలో రక్షణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు ఇక్కడుంటే రక్షణ అంశాలు పరిశీలించాల్సి అధికార కార్యాలయాలు మాత్రం హైదరాబాద్‌ ఉన్నాయి. దీంతో  పరిశ్రమల్లో నిత్యం తనీఖీ చేయటం వట్టి మాటగా మారింది.  కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు, నాయకులు  అనంతరం ఇటు వైపు చూడటం లేదు. నెలలో కనీసం ఐదు వరకు ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. వరుసగా జరుగుతున్నా ప్రమాదాలతో కార్మికుల కుటుంబాలతో పాటు స్థానిక ప్రజలు సైతం భయాంందోళనలో వ్వక్తం చేస్తున్నారు. 


అందుబాటులో లేని ఫైర్‌ స్టేషన్‌

సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలో సుమారు 450 వరకు పరిశ్రమలున్నా ఒక్క అగ్నిమాపక కేంద్రం లేదు. సుమారు 10 గ్రామాల పరిఽధిలో భారీ పరిశ్రమలున్నా ప్రభుత్వాలు ఒక్క ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయలేదు. మూడు దశాబ్ధాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే పటాన్‌చెరు, జీడిమెట్ల, సనత్‌నగర్‌, సంగారెడ్డి లాంటి దూర ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజిన్‌లు వచ్చేలోపే ప్రమాద తీవ్రత అఽధికమవుతోంది. ఆస్తి, ప్రాణ, నష్టం భారీగా జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి.  ఎన్నోమార్లు ప్రభుత్వానికి కార్మికులు, స్థానికులు ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు కోసం విన్నవించినా ఏర్పాటు చేయడంలేదు. బొల్లారం మున్సిపాలిటీలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు స్థలం కేటాయించినా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇక కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు తమ యూనిట్లలో ప్రమాదాల నివారణ కోసం సొంతంగా ఫైర్‌ ఇంజిన్‌లను ఏర్పాటు చేసుకోగా.. స్థానికంగా ప్రమాదాలు జరిగితే మొదట వీరే స్పందిస్తున్నారు. 


Updated Date - 2020-12-14T04:24:32+05:30 IST