బడిలో స్వచ్ఛత ఏదీ?
ABN , First Publish Date - 2020-12-11T06:10:32+05:30 IST
మెదక్ అర్బన్, డిసెంబరు 10: స్వచ్ఛ కార్మికుల తొలగింపుతో పాఠశాలలు కంపుకొడుతున్నాయి. జిల్లాలో మొత్తం 872 ప్రభుత్వ పాఠశాలున్నాయి.
స్కావెంజర్ల తొలగింపుతో ఇబ్బందులు
కంపు కొడుతున్న పాఠశాలలు
పరిశుభ్రత పనుల్లో ఉపాధ్యాయులు
మెదక్ అర్బన్, డిసెంబరు 10: స్వచ్ఛ కార్మికుల తొలగింపుతో పాఠశాలలు కంపుకొడుతున్నాయి. జిల్లాలో మొత్తం 872 ప్రభుత్వ పాఠశాలున్నాయి. అందులో 608 ప్రాఽథమిక, 125 ప్రాథమికోన్నత, 139 ఉన్నత పాఠశాలులున్నాయి. కోవిడ్–19 కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 882 మంది స్కావెంజర్తను తొలగించారు. తొమ్మిది నెలలుగా ఉపాధి కోల్పోయారు. దీంతో తరగతి గదుల్లో పాఠశాల ఆవరణలో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. చేసేందేంలేక ఉపాధ్యాయులు స్టాఫ్ రూంను మాత్రమే శుభ్ర పరుచుకుంటున్నారు.
స్వచ్ఛతపై ప్రభావం
పాఠశాలల పరిశుభ్రత పనులు చేసే స్కావెంజర్లను అధికారులు పార్ట్‌టైం వర్కుర్లుగానే పరిగణిస్తుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో స్కావెంజర్లకు నెలకు రూ. 1500, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ. 2000, ఉన్నత పాఠశాలల్లో రూ.2500 చొప్పన చెల్లిస్తున్నా.. వారికి నియామక పత్రాలు ఇవ్వకుండానే పని చేయించుకున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఆధారంగా 70 మంది కంటే ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్‌కు రూ.2 వేల చొప్పున ఇచ్చేవారు. ఈ ఏడాది మార్చి నుంచి స్కావెంజర్లకు వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా వారిని రెన్యూవల్ కూడా చేయలేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందికి పారిశుధ్య పనులను అప్పగించింది. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వీధులను శుభ్రం చేయడం తదితర పనులతో తీవ్రమైన పనిభారం పడుతున్న తమకు పాఠశాలల బాధ్యతలను అప్పగించడంపై పంచాయతీ సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. మరుగుడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయడానికి వారు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బడుల్లో పరిశుభ్రత, స్వచ్ఛతపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా పాఠశాల్లో స్కావెంజర్ల నియామకాన్ని పక్కనపెట్టి పంచాయతీ కార్మికులతో పాఠశాలల్లో పనులు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ఉపాధ్యాయుల తిప్పలు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొవిడ్–19 నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఉపాధ్యాయులు వంతులవారీగా విధులకు వెళ్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలుకుతున్నది. అసలే సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛ కార్మికులు లేకపోవడంతో కంపుకొడుతున్నాయి. నిర్వహణ లేక మరుగుదొడ్లు, మూత్రశాలలు ధ్వంసమవుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన స్వీపర్లను తిరిగి చేర్చుకోకపోవడంతో చెత్తను ఊడ్చేవారు కరువయ్యారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దుర్గంధంలో ఉండలేక పాఠశాలలను శుభ్రం చేసుకోవాల్సి వస్తున్నది. నీళ్లు తెచ్చుకోవడం, చెత్తను ఊడ్వటం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో కార్మికుడిని నియమించుకున్నారు.