అర్జీదారులకు కలెక్టరేట్‌లో నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-06-18T11:07:45+05:30 IST

సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. జిల్లాలోని మిగిలిన రెవెన్యూతో పాటు ఇతర కార్యాలయాల్లోకి

అర్జీదారులకు కలెక్టరేట్‌లో నో ఎంట్రీ

ఉద్యోగులను వెంటాడుతున్న  కరోనా భయం

అధికారుల తీరుపైనా ఆందోళన


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 17: సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. జిల్లాలోని మిగిలిన రెవెన్యూతో పాటు ఇతర కార్యాలయాల్లోకి కూడా అర్జీదారులను రానీయడం లేదు. అర్జీదారులు ఇచ్చే పిటిషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌లలో వేయడం లేదా దూరం నుంచే ఇచ్చే ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అరవై మందికి పైగా కరోనా సోకడంతో ఉద్యోగులు ఈ రకమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 


కలెక్టరేట్‌ ప్రవేశ ద్వారం వద్ద బాక్స్‌

కలెక్టరేట్‌ ప్రవేశం ద్వారం వద్ద యంత్రాంగం ఒక స్టీలు డబ్బాను ఏర్పాటు చేసింది. కలెక్టరేట్‌లో అధికారులెవరికైనా ఇవ్వాలనుకున్న అర్జీలను ప్రజలు ఈ డబ్బాలో వేసి వెళ్లాలి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లను, ఇతర అధికారులను కలిసి అర్జీలు ఇస్తామని కోరినా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసులు అనుమతించడం లేదు.


కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతరత్రా పనుల కోసం వెళ్లే ముఖ్యులకు ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీదారులను లోపలికి రానీయకుండా తలుపుల వద్ద టేబుల్‌ను అడ్డుపెట్టారు. తమ అర్జీలను టేబుల్‌పైన పెట్టడం లేదా బయట నుంచే టేబుల్‌ లోపల ఉన్న ఉద్యోగులకు ఇవ్వాలి. ఇదే పరిస్థితి జిల్లాలోని దాదాపు అన్ని కార్యాలయాల్లో కనిపిస్తోంది.  సంగారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద కూడా థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. 


అధికారుల రాకపోకలపై ఆందోళన

కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు మినహా దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులు రోజూ హైదరాబాద్‌ నుంచే ప్రభుత్వ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆయా శాఖల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.   హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే అధికారులను నియంత్రించి, తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. 


తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఫిర్యాదుల పెట్టె

జిన్నారం: కరోనా నేపథ్యంలో ఫిర్యాదులు, దరఖాస్తుల స్వీకరణకు జిన్నారం తహసీల్దార్‌ కార్యాలయంలో స్వీకరణ పెట్టెను ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే వారు తమ అర్జీలను, శాఖాపరమైన ఫిర్యాదుల ప్రతులను పెట్టెలో వేసేలా ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-06-18T11:07:45+05:30 IST