కల్లాల నిర్మాణంలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 21 : రైతులు పండించిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టుకునే సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో పంట పొలాల వద్దే కల్లాలను నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

కల్లాల నిర్మాణంలో నిర్లక్ష్యం
పుల్కల్‌ మండలం గొంగ్లుర్‌ వద్ద సింగూర్‌ ప్రధాన రహదారిపై ధాన్యాన్ని ఆరబోసిన దృశ్యాలు

రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్న  రైతులు

జిల్లాలో 4819 కల్లాలకుగాను పూర్తయినవి 235

నిర్మాణానికి రూ.36.37 కోట్ల కేటాయింపులు

ఖర్చు చేసింది కేవలం రూ.48.14 లక్షలే!

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 21 : రైతులు పండించిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టుకునే సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో పంట పొలాల వద్దే కల్లాలను నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4819 కల్లాల నిర్మాణానికి అనుమతులు లభించగా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.36.37 కోట్లు కేటాయించింది. ఈ నిధులను పది నెలల క్రితం కేంద్రం విడుదల చేయగా కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఖర్చు శ్రమ లేకుండా రహదారులపై ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి అలవాటుపడ్డ అన్నదాతలు కల్లాల నిర్మాణాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. కల్లాల ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ  చూపడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగానే రైతులు తమ పొలాల వద్ద కల్లాలను నిర్మించడంపై ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రహదారులపై ధాన్యం ఆరబోత

పంట పొలాల వద్ద కల్లాలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించినా జిల్లాలో కల్లాల నిర్మాణంలో తీవ్ర తాత్సారం జరుగుతున్నది. ప్రధానంగా వరి ధాన్యాన్ని కిలోమీటర్ల మేర రహదారులపై ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ ఇరుకుగా మారి ప్రమాదాలకు దారితీస్తున్నది. జిల్లాలోని పుల్కల్‌, అందోల్‌, మునిపల్లి, హత్నూర, కొండాపూర్‌, సంగారెడ్డి, వట్‌పల్లి, కాదిరాబాద్‌ మండల పరిధిలో ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారు. 

పూర్తయిన కల్లాలు 235 మాత్రమే

పంట పొలాల వద్దే కల్లాలు నిర్మించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో చేపట్టాల్సి ఉండగా.. వ్యవసాయ శాఖ అందుకు అవసరమైన అంచనాలను రూపొందించి నివేదిక ఇవ్వగానే డీఆర్డీవో ఆధ్వర్యంలో కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 4819 కల్లాలకు రూ.36.37 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు కేవలం 235 కల్లాలు మాత్రమే పూర్తయ్యాయి. వీటికి రూ.48.14 లక్షలు ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. కల్లాలను నిర్మించుకునే లబ్ధిదారులకు (రైతులకు) రెండు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 


Updated Date - 2020-11-21T05:30:00+05:30 IST