నత్తనడకన నాలా పనులు

ABN , First Publish Date - 2020-11-25T05:53:27+05:30 IST

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 24 : నాలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్టలకు అనుసంధానంగా ఉన్న నాలాల పునరుద్ధరణ కోసం 2017లో రూ.5.91 కోట్లు విడుదల చేసింది.

నత్తనడకన నాలా పనులు
బొబ్బిలికుంటలో అసంపూర్తిగా నిలిచిపోయిన అలుగు నిర్మాణం

గడువు దాటి ఏడాది గడిచినా పూర్తికాని పునరుద్ధరణ

అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్‌

ఇంకా మిగిలి ఉన్న 30శాతం పనులు

నాణ్యతపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 24 : నాలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్టలకు అనుసంధానంగా ఉన్న నాలాల పునరుద్ధరణ కోసం 2017లో రూ.5.91 కోట్లు విడుదల చేసింది. అయితే నీటి పారుదల (ఇరిగేషన్‌) శాఖ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ అలసత్వంతో రెండున్నరేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. 

పనుల్లో జాప్యం

సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని దేవునికుంట నుంచి పీనుగులకుంట, తుర్కవానికుంట, బొబ్బిలికుంట మీదుగా పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌ చెరువులోకి వర్షపు నీరు సాఫీగా వెళ్లడానికి కాల్వల పునరుద్ధరణ చేపట్టాలని, అవసరమున్న చోట వంతెనలు నిర్మించాలని నీటి పారుదల శాఖ అధికారులు అప్పట్లోనే ప్రణాళికలు తయారు చేశారు. 2018 ఫిబ్రవరిలో పనులను దక్కించున్న కాంట్రాక్టర్‌ 18 నెలల్లోగా పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. 650 మీటర్ల పొడవున నాలా పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 455 మీటర్లు మాత్రమే పూర్తి చేశారు. నాలుగు వంతెనలకుగాను మూడు వంతెనలు పూర్తయ్యాయి. పూర్తయిన పనులకు కాంట్రాక్టర్‌కు ఇప్పటికే రూ.3 కోట్లు చెల్లించారు. అయితే పూర్తయిన పనుల్లో కూడా కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాలాపై అక్రమ నిర్మాణాలు 

పట్టణంలోని బొబ్బిలికుంట నుంచి మహబూబ్‌సాగర్‌ చెరువులోకి రిక్షా కాలనీ, మగ్దుంనగర్‌, నాల్‌సాబ్‌గడ్డ, సోమేశ్వరవాడ కాలనీల మీదుగా ఉన్న నాలాను ఆక్రమించిన కొందరు ఇళ్లను నిర్మించుకున్నారు. వర్షాకాలంలో ఏర్పడే వరదలతో బొబ్బిలికుంట నాలా నిండి దానిపై అక్రమంగా నిర్మించిన ఇళ్లల్లోకి నీరు చేరుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరిన ప్రతీసారి అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, మూడు నాలుగు రోజులపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముంపునకు గురైన కుటుంబాలను ప్రజాప్రతినిధులు పరామర్శించి, ఆదుకుంటామని హామీల వర్షం కురిపించి వెళ్లడం సర్వసాధారణంగా మారింది. అక్రమ నిర్మాణాలను తొలగించి నాలా పునరుద్ధరణ చేపట్టకపోవడంతోనే ఏటా నాలా వెంట ఉన్న వందలాది ఇళ్లు వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి.

మంత్రి ఆదేశాలూ బేఖాతరు

సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు బొబ్బిలికుంట నాలా వెంబడి ఉన్న ఇళ్లల్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో బాధితులను పరామర్శించేందుకు సంగారెడ్డికి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నాలాను పరిశీలించారు. నాలా పునరుద్ధరణ పనులు మూడేళ్లుగా ముందుకు సాగకపోవడంపై ఇరిగేషన్‌ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలికుంట-మహబూబ్‌సాగర్‌ చెరువు మధ్యలో రిక్షాకాలనీ, మగ్దుంనగర్‌, నాల్‌సాబ్‌గడ్డ కాలనీల మీదుగా ఉన్న నాలా పునరుద్ధరణ పనులను వారంలోగా పూర్తి చేయించాలని ఇరిగేషన్‌ డీఈ బాలగణేష్‌ను ఆదేశించారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

బాధితులకు అందని పరిహారం

నాలా పునరుద్ధరణలో భాగంగా పట్టణంలోని రెండు ఇళ్లను పూర్తిగా, 68 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు బాధితులెవరికీ పరిహారం అందలేదు. తాము కోల్పోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వడంలో అధికారులు రెండేళ్లుగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-25T05:53:27+05:30 IST