పానశాలగా మారిన పాఠశాల!
ABN , First Publish Date - 2020-07-08T11:42:10+05:30 IST
బడంటే.. గుడితో సమానం. అటువంటి పాఠశాలను పానశాలగా మార్చేశారు దుండగులు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో అసాంఘిక ..

బరితెగించిన మందుబాబులు
బడిలోనే ‘సిట్టింగు’లు
అల్లాదుర్గం, జూలై 7: బడంటే.. గుడితో సమానం. అటువంటి పాఠశాలను పానశాలగా మార్చేశారు దుండగులు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో అసాంఘిక శక్తులు తీష్టవేస్తున్నాయి. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ ఉన్నత పాఠశాలలో మద్యంప్రియుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో మద్యపానం నిషేధించడంతో కొందరు మద్యం ప్రియులు పాఠశాలను అడ్డాగా మార్చుకున్నారు. ప్రహరీ లేకపోవటంతో యథేచ్ఛగా స్కూల్లోకి ప్రవేశించి సిట్టింగులు వేస్తున్నారు. జూదం ఆడుతూ.. మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గ్రామస్థులపై తిరగబడుతున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ విద్యాశాఖ అధికారులుకు సమాచారమిచ్చినా సెలవుల కారణంగా స్పందించడం లేదు.
ఖాళీ సీసాలతో నిండిపోతున్నది..కృష్ణ లింగప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్
పాఠశాల ఆవరణలో మందుబాబులు తిష్ట వేస్తున్నారు. మద్యం తాగుతూ గందరగోళం చేస్తున్నారు. రోజూ పొద్దున్నే ఖాళీ సీసాలు ఏరేయడం డ్యూటీగా మారిపోయింది. సెలవులు ఉండడం, ప్రహరీ లేకపోవటంతో ఎవరుపడితే వారు స్కూల్లో ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.