గిరిజన యువకుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-12-06T06:05:13+05:30 IST
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని శేకలి కుంటా గిరిజన తండాకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

మృతదేహం తరలింపును అడ్డుకున్న గిరిజనులు
జాతీయ రహదారి పై రాస్తారోకో
కల్హేర్, డిసెంబరు 5: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని శేకలి కుంటా గిరిజన తండాకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన కేతావత్ సురేష్(22) అనే యువకుడి మృతదేహం బాచెపల్లి గ్రామ శివారులోని 161వ జాతీయ రహదారి పక్కన లభ్యమైంది. శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న సురేష్ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందని ఇంట్లో చెప్పి వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా బాచెపల్లి గ్రామశివారులోని జాతీయరహదారి పక్కన మృతదేహమై కనిపించినట్టు కుటుంబ సభ్యులు, తండావాసులు తెలిపారు. సమాచారమందుకున్న కల్హేర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పంచనామా జరిపి మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తుండగా గిరిజనులు పోలీసులకు అడ్డుపడ్డారు. సురే్‌షను హత్య చేశారని, క్లూస్ టీంను రప్పించి తమకు న్యాయం చేసేవరకూ మృతదేహాన్ని అక్కడినుంచి కదిలించేది లేదంటూ వారు మొండికేశారు. జాతీయరహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో దాదాపు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కంగ్టి సీఐ వెంకటేశ్వర్‌రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనుల డిమాండ్ మేరకు సంగారెడ్డి నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించడానికి హామీ ఇవ్వడంతో గిరిజనులు అందోళన విరమించారు. గతంలో సురేష్ తండ్రిని సైతం ఇలాగే రాత్రి పూట ఇంటి నుంచి పిలిపించి హత్య చేశారని, కుమారుడిని కూడా అదేరీతిలో చంపారని బాధితులు వివరించారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అందోళన చేస్తున్న గిరిజనులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవ్ మద్ధతు తెలిపి హంతకులను గుర్తించాలని డిమాండ్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కల్హేర్ ఇన్‌చార్జి ఎస్‌ఐ నారాయణ తెలిపారు.