రసాభాసగా బొల్లారం మున్సిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-06-19T08:17:04+05:30 IST

అభివృద్ధి పనుల ఎంపిక.. నిధుల మంజూరులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బొల్లారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు

రసాభాసగా బొల్లారం మున్సిపల్‌ సమావేశం

జిన్నారం, జూన్‌ 18: అభివృద్ధి పనుల ఎంపిక.. నిధుల మంజూరులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బొల్లారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు ఆరోపణలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసుల పహారా మధ్య సమావేశాన్ని నిర్వహించారు. గురువారం బొల్లారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ రోజారాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వైస్‌చైర్మన్‌ అనిల్‌రెడ్డి, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. నిధుల కేటాయింపు, సమస్యల గుర్తింపులో తమ ప్రమేయం లేకుండానే అభివృద్ధి పనులు ఎంపిక చేశారని ఆరోపించారు. చైర్‌పర్సన్‌ను ఉద్దేశించి విమర్శలు చేయడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.


సీఐ ప్రశాంత్‌, పోలీసులు సిబ్బంది ప్రవేశించి ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా మున్సిపాలిటీలో ప్రాధాన్య క్రమంలో సమస్యలు గుర్తించి, నిధులు కేటాయిస్తున్నామని చైర్‌పర్సన్‌ రోజారాణి తెలిపారు. పారిశ్రామికవాడ, చెరువుల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై కొందరు సభ్యులు అభ్యంతరం తెలుపగా, వాటికే ప్రాధాన్యం ఇస్తున్నామని చైర్‌పర్సన్‌ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై చర్చ అనంతరం రూ.5.13 కోట్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్‌ కేశురాం, ఆర్వో శ్రీధర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-19T08:17:04+05:30 IST