తెల్లాపూర్‌లో త్వరలోనే ఆర్‌యూబీ

ABN , First Publish Date - 2020-12-30T05:56:03+05:30 IST

రామచంద్రాపురం, డిసెంబరు 29: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యవసరంగా చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి పనులపై మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యాతో చర్చించారు.

తెల్లాపూర్‌లో త్వరలోనే ఆర్‌యూబీ

 మరో రెండు చోట్ల ఆర్వోబీలు కూడా..

  నిర్మించాలని రైల్వే జీఎంతో చర్చించిన మెదక్‌ ఎంపీ

 పటాన్‌చెరు నుంచి జంటనగరాలకు  ఎంఎంటీఎస్‌ సేవలపైనా సూచించిన ప్రభాకర్‌రెడ్డి


రామచంద్రాపురం, డిసెంబరు 29: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యవసరంగా చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి పనులపై మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యాతో చర్చించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని జీఎం కార్యాలయంలో సమావేశమైన ఎంపీ, తక్షణం చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్‌లో రోడ్‌ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం అత్యవసరంగా చేపట్టాలని ఎంపీ సూచించారు. ఇక్కడి ప్రజలు చాలా ఏళ్లుగా అవస్థలు పడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. పటాన్‌చెరు నుంచి జంటనగరాలకు ఎంఎంటీఎస్‌ ట్రెయిన్‌ను ఉద్యోగులు, కూలీలు, విద్యార్థులు నగరానికి రాకపోకలు సాగించే సమయానికి అనుకూలంగా నడపాలని కోరారు. దీని వల్ల ఈ ప్రాంతం నుంచి వెళ్లి నగరంలో ఉద్యోగం చేసే వారికి, పనులు చేపట్టే వారికి అనువుగా ఉండడమే కాకుండా సమయం కలిసి వస్తుందని, రవాణాఖర్చులు తగ్గి వెసులుబాటు కలుగుతుందని వివరించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) కొల్లూరు జంక్షన్‌ వద్ద, ఈదులనాగులపల్లి రైల్వే క్రాసింగ్‌ వద్ద రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులను ప్రారంభించాలని ఎంపీ రైల్వే జీఎం దృష్టికి తెచ్చారు.. చేగుంట-మెదక్‌ రోడ్డులోని బ్రాహ్మణపల్లి రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్‌ఓబీ పనులు చేపట్టాలని సూచించారు. చేగుంట రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం ఆధునికీకరణ పనులు చేపట్టాలని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఎంపీ రైల్వే జీఎంను కోరారు. ఈ అంశాలపై గజానన్‌ మాల్యా సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు.మెదక్‌ 


రైల్వేలైన్‌కు రూ.20 కోట్లు మంజూరు : పద్మారెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ, డిసెంబరు 29: మెదక్‌ పట్టణంలో నిర్మిస్తున్న అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.20 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మెదక్‌-అక్కన్నపేట రైల్వేలైన్‌ పనుల్లో పురోగతి సాధించడానికి తాను విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్‌ రూ.20 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె  కృతజ్ఞతలు తెలిపారు. నిధుల లేమి కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతున్నదన్నారు. నిధుల విడుదలతో పూర్తిస్థాయిలో పనులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే మెదక్‌ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావుకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2020-12-30T05:56:03+05:30 IST