మాయమైపోతున్నారు.. మిస్టరీగా మారుతున్న మిస్సింగ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-27T19:48:47+05:30 IST
కరోనా విజృంభిస్తున్న సమయంలో బయట తిరగొద్దని తండ్రిమందలించడంతో ఈనెల 19న సంగారెడ్డిలో పదమూడేళ్ల బాలు

గతేడాది 400, ఈ ఏడాది 149 నమోదు
ప్రకటనతోనే సరిపెడుతున్న పోలీసులు
ప్రత్యేక బృందాల ఊసే లేదు
సంగారెడ్డి(ఆంధ్రజ్యోతి) : కరోనా విజృంభిస్తున్న సమయంలో బయట తిరగొద్దని తండ్రిమందలించడంతో ఈనెల 19న సంగారెడ్డిలో పదమూడేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. తిరిగి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి పట్టణంలో సెల్‌ఫోన్ విషయంలో భర్తతో గొడవ పడిన భార్య తన రెండేళ్ల కూతురుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈనెల 20వ తేదీ నుంచి భార్యా,బిడ్డ కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వారి కుటుంబాలు తమ వారి ఆచూకీ తెలియక వేదనను అనుభవిస్తుండగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు.
కొన్ని సంవత్సరాల వరకు కుటుంబంలో ఒకరిగా ఉండి, సుఖ సంతోషాల్లో భాగస్వాములైన వారు ఒక్కసారిగా కనిపించకపోతే ఆ కుటుంబం పడే మనోవేదన వర్ణణాతీతమనే చెప్పాలి. వారంతా ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో, ఎలా ఉన్నారో తెలియక కుటుంబీకులు దుఃఖాన్ని తమ గుండెల్లోనే దాచుకుంటూ ఏ రోజైనా తిరిగి రాకపోతారా ? అని కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఒకరు అదృశ్యమవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. తమ వారి ఆచూకీ వెతికి పెట్టాలని వారంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఈ కేసులు మాత్రం పేపర్‌కే పరిమితమవుతున్నాయి. తప్పిపోయిన వ్యక్తుల గురించి పత్రికల్లో ప్రచురింపజేయడంతోనే పోలీసులు సరిపెట్టుకుంటున్నారు. వారి ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. బాధితులు మాత్రం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు.
అమలు కాని ఉన్నతాధికారుల ఆదేశాలు
కేసుల దర్యాప్తులో అదృశ్యమవుతున్న వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనిపోలీసు ఉన్నతాధికారులు నేర సమీక్ష సమావేశాల్లో పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ 24 గంటల్లో తెలియకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. వ్యక్తి ఫొటోతో వివరాలను పత్రికల్లో ప్రచురించాలి. అదృశ్యమైన వ్యక్తి తరచుగా సందర్శించిన ప్రాంతాల్లోని పోలీ్‌సస్టేషన్లకు సమాచారం చేరవేయాలి. కుటుంబ సభ్యులను కలిసి పోలీసులు అనుమానిత ప్రదేశాలకు వెళ్లి వారి ఆచూకీ కోసం ప్రయత్నించాల్సి వుంటుంది. కానీ కనిపించని వారి కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం, ఆ తర్వాత వారి ఫొటో వివరాలను పత్రికల్లో ప్రచురింపజేయడంతోనే సరిపెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు.
కేసుల పరిష్కారంలో నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. అదృశ్యమవుతున్న కేసుల్లో కొందరు హత్యకు గురైన సందర్భాలు ఉన్నాయి. కేసుల్లో మెజార్టీ వ్యక్తులు ఎక్కడో బతికి వున్నప్పటికీ వారి ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నం మాత్రం పోలీసులు చేయడం లేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి పోలీ్‌సస్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు కనికరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పిపోయిన వారు దొరికితే తాము కబురు పంపుతాం అంటూ ఫిర్యాదుదారులకు సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారు.
ప్రత్యేక బృందాల జాడెక్కడ ?
సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమవుతున్న కేసులు ప్రతి సంవత్సరమూ పెరిగిపోతున్నాయి. 2019 సంవత్సరంలో 400 కేసులు నమోదు కాగా, 2020 జనవరి నుంచి జూన్ నెల వరకు 149 కేసులు నమోదైనట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో అదృశ్యమవుతున్న కేసులను పరిష్కరించడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలి. కానీ అటువంటి బృందాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆ పోలీసు బృందాలు పనిచేస్తున్నాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖలో ఉన్న సిబ్బందికి రోజు వారి పనితోనే సరిపోతుందని కొందరు పోలీసులు అంటున్నారు. జిల్లా కేంద్రాల్లో అయితే వీఐపీల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. వారికి బందోబస్తు నిర్వహించడం, ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేసే వారిని అడ్డుకోవడంతోనే సరిపోతుంది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీసులకు పని ఒత్తిడి మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అదృశ్యమవుతున్న వారి గురించి సమగ్ర దర్యాప్తు ఎలా సాధ్యమవుతుందని కొందరు పోలీసులు ఉన్నతాధికారులు అంటున్నారు.