పత్తి కొనుగోళ్లలో వ్యాపారి తప్పుడు లెక్క

ABN , First Publish Date - 2020-11-26T06:13:09+05:30 IST

పత్తి రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పత్తి కొనుగోలు చేసి, తప్పుడు లెక్కలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.

పత్తి కొనుగోళ్లలో వ్యాపారి తప్పుడు లెక్క

గజ్వేల్‌, నవంబరు 25: పత్తి రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పత్తి కొనుగోలు చేసి, తప్పుడు లెక్కలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సంగుపల్లికి చెందిన ఓ రైతు తన పంట చేనులో తీసిన పత్తిని ఆటో ద్వారా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఓ దుకాణానికి తీసుకువచ్చి అమ్ముకున్నాడు. అదే సమయంలో ఆటోను ధర్మకాంటా ద్వారా తూకం వేశాడు. కాంటాలో 200 కిలోలు పత్తి కావడంతో రెండు కిలోలు తరుగు కింద సదరు వ్యాపారి తొలగించాడు. అప్పుడు 198 కిలోలకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, 188 కిలోలుగా వేసి, ఆ మొత్తానికి రూ.5,300 ధర వేసి డబ్బులు చెల్లించాడు. సదరు రైతు అది గమనించక ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ రైతు కుమారులు మంగళవారం రాత్రి గమనించి, ఉదయాన్నే సదరు వ్యాపారి వద్దకు వచ్చి ప్రశ్నించగా, లెక్క తప్పుపోయిందని మిగిలిన 10 కిలోల డబ్బులను రైతుకు చెల్లించాడు. ఈ సందర్భంగా సదరు రైతు మాట్లాడుతూ తన కుమారులు లెక్క సరిచూడకపోతే పది కిలోల డబ్బులు పోయేవని ఆందోళన వ్యక్తం చేశాడు.  అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మోసం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధిత రైతు కోరాడు.


Updated Date - 2020-11-26T06:13:09+05:30 IST