నల్లానల్లాని బియ్యం..

ABN , First Publish Date - 2020-03-08T07:46:10+05:30 IST

వరి అనగానే పచ్చని పైరు, తెల్లని బియ్యమనే చాలామందికి తెలుసు. కానీ నల్లని నల్లటి బియ్యం కూడా పండుతాయని కొందరికే తెలుసు. ఈ బియ్యంతో శరీరానికి...

నల్లానల్లాని బియ్యం..

  •  దిగుబడి తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ
  •  కిలో ధర రూ.200 నుంచి రూ.250 వరకు
  •  తొగుట మండలం లింగాపూర్‌లో దేశీయ ఉత్పత్తి
  •  రసాయన ఎరువులు లేకుండా గో ఆధారిత సాగు
  •  నల్లబియ్యం సాగుచేస్తున్న తిరుపతి
  •   సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సేంద్రియం వైపు అడుగులు
  •  పలువురు రైతులను ప్రోత్సహిస్తా : తిరుపతి  


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 7: వరి అనగానే పచ్చని పైరు, తెల్లని బియ్యమనే చాలామందికి తెలుసు. కానీ నల్లని నల్లటి బియ్యం కూడా పండుతాయని కొందరికే తెలుసు. ఈ బియ్యంతో శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. అందుకే జక్కుల తిరుపతి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రైతు అవతారమెత్తి నల్లబియ్యాన్ని పండిస్తున్నాడు. కొమురవెల్లి మండలం నాగపురికి చెందిన జక్కుల తిరుపతి పీజీ వరకు చదివి హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనూ పనిచేశాడు. క్యాబ్‌ల వ్యాపారం కూడా నిర్వహించాడు. ఆ తర్వాత విజయవాడలో సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులను విక్రయించే షాపును నడిపాడు. ఇవన్నీ వదిలి తన ప్రస్థానాన్ని పల్లెల వైపు మళ్లించాడు. ప్రస్తుతం తన అత్తగారి గ్రామమైన తొగుట మండలం లింగాపూర్‌లో ఎకరం భూమిలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాడు. వచ్చే ఖరీ్‌ఫలో తన స్వగ్రామమైన నాగపురిలోనూ సాగుకు సమాయత్తమవుతున్నాడు. 


మూడు రకాల విత్తనాలతో సాగు

ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో నాలుగైదు రకాల పాలిష్‌ బియ్యానికే ప్రజలు అలవాటు పడ్డారు. ఫలానా బియ్యంతో వండితేనే ముద్ద దిగుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే వరిసాగులో 60రకాల విత్తనాలు ఉంటాయట. ఇందులో చాలావరకు నాటు రకం విత్తనాలే. ప్రస్తుతం తిరుపతి మూడు రకాల వరిని సాగు చేస్తున్నాడు. కాలా బట్టి(బ్లాక్‌ రైస్‌), దాసుమతి రకం, చింతలూరి సన్నాలను వృద్ధి చేస్తున్నాడు. వచ్చే ఏడాది మరో 50 రకాల వరి పంటలు అభివృద్ధి చేస్తానని తిరుపతి ధీమాగా చెబుతున్నాడు. 


ఆవు మలమూత్రాదులే ఎరువులుగా

పొలంలో కాంప్లెక్సు, రసాయనాలు, యూరియాను వెదజల్లి పంటలు ఉత్పత్తి చేస్తున్న కాలం ఇది. ఈ రసాయనాలను పూర్తిగా పక్కనబెట్టి కేవలం జీవామృతాన్నే ఎరువుగా వినియోగించడం తిరుపతి ప్రత్యేకత. అందుకే శ్రేష్ఠమైన దేశీ ఆవుల పేడ, మూత్రాన్ని సేకరించి అందులో శనగపిండి, బెల్లం కలిపి జీవామృతాన్ని తయారు చేస్తున్నాడు. వారానికోకసారి పొలంలో చల్లుతున్నాడు. కొన్ని సందర్భాల్లో స్ర్పే విధానంతో సేంద్రియ ద్రావణాలను పంటకు పట్టిస్తున్నాడు. 


నాటు వరి బియ్యానికి ఫుల్‌ డిమాండ్‌

కాలాబట్టి, దాసుమతి, చింతలూరి సన్నం తదితర వరి ధాన్యాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నల్ల బియ్యంతో కేన్సర్‌, ఒళ్లునొప్పులు, ఊబకాయం నియంత్రణలో ఉంటాయని తిరుపతి చెబుతున్నాడు. సాధారణ వరి రకాలను పోల్చితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని అంటున్నాడు. ఇది కిలోకు రూ.200 నుంచి రూ.250వరకు ధర పలుకుతున్నట్లు వివరించాడు.


నాన్న మరణంతోనే ఈ మార్పు

నాన్నకు కేన్సర్‌ వచ్చిందని తెలిసిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తినే ఆహారంతోనే కేన్సర్‌ వచ్చిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ బాధలో నుంచే సేంద్రియ సాగు, నాటు రకం వరి వంగడాలపై దృష్టి పెట్టాను. ఇలా పండించిన ఆహారంతో రోగమనేదే దరి చేరదు.  పైగా శరీరం ధృఢంగా, ప్రశాంతంగా ఉంటుంది. మా నాన్నలాంటి ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను. కొందరు రైతులను ప్రొత్సాహించాలనుకున్నా. నాటు రకం విత్తనాలు కావాలనుకున్నవారికి ఉచితంగా అందజేస్తాను. విత్తనాలకు 9000269724 నంబర్‌లో సంప్రదించవచ్చు. త్వరలోనే నాటు వరి విత్తనాల జాతరను నిర్వహించాలనుకుంటున్నాను.

- జక్కుల తిరుపతి, రైతు

Updated Date - 2020-03-08T07:46:10+05:30 IST