ప్రతిభకు చిరునామా.. అఖిల

ABN , First Publish Date - 2020-03-08T07:40:33+05:30 IST

వ్యవసాయంపై ఆధారపడిన పేద కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఆమె. చేర్యాల మండలం కడవెరుగు...

ప్రతిభకు చిరునామా.. అఖిల

ఎలాంటి కోచింగ్‌ లేకుండా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక


కొమురవెల్లి రూరల్‌, మార్చి 7: వ్యవసాయంపై ఆధారపడిన పేద కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఆమె. చేర్యాల మండలం కడవెరుగు గ్రామానికి చెందిన కొయ్యడ ఆంజనేయులు, అనిత దంపతులది పేద కుటుంబం. కుమార్తె అఖిల తమలా కష్టపడవద్దని ఆ తల్లిదండ్రులు ఆమెను కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల ఆశయం మేరకు ఆశయం మేరకు ఓవైపు తల్లిదండ్రులకు పనిలో సాయం చేస్తూనే, మరోవైపు కష్టపడి చదివింది. ఇంటర్‌ అనంతరం టీచర్‌ ట్రైనింగ్‌ చేసింది. దూరవిద్యలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ పూర్తి చేసింది. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైంది.


2017లో రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలు, 2018లో పంచాయితీ సెక్రటరీ, 2019 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికై స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వీఆర్వో ఉద్యోగానికి మెరిట్‌ జాబితాలో పేరున్నప్పటికీ, ఆ ఉద్యోగంలో చేరడం ఇష్టంలేక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వెళ్లలేదని చెప్పిందన్నారు. ప్రస్తుతం తూప్రాన్‌ మండలం వట్టూరు ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ‘ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరిన తరువాతనే  స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కున్నాను. ఫోన్‌ వాడకాన్ని తగ్గిస్తే జీవితంలో సగం విజయం సాధించినట్టే. ఇప్పటికీ ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తాను. తల్లిదండ్రులు, మామయ్య రాజు ప్రోత్సహంతోనే విజయం సాధ్యమైంద’ని ఆమె అన్నారు. ‘సివిల్‌ సర్వీసెస్‌ సాధించడమే తన లక్ష్య’మని స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-08T07:40:33+05:30 IST