గూడు చెదిరింది
ABN , First Publish Date - 2020-11-13T09:41:04+05:30 IST
వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు.. వారి స్థితిగతులను పరిశీలించి 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి హమాలీలకు స్థలాలను కేటాయించింది. ఆ స్థలాల్లో వారు రెండు గదులను
మెదక్ హమాలీ కాలనీలో ఇళ్ల కూల్చివేత
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు స్థలం కేటాయింపు
కూల్చివేతలను అడ్డుకున్న పేదలు
దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన
ప్రాణాలు పోయినా స్థలాన్ని వదులుకోం
తహసీల్దార్ కార్యాలయం, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన లబ్ధిదారులు
మెదక్ అర్బన్, నవంబరు 12 : వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు.. వారి స్థితిగతులను పరిశీలించి 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి హమాలీలకు స్థలాలను కేటాయించింది. ఆ స్థలాల్లో వారు రెండు గదులను నిర్మించుకున్నారు. అయితే ఈ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా మెదక్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయించారు. ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ పోతాయోననే పాడుబడిన ఇళ్లకు మరమ్మతులు చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. వాటిని గురువారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ అధికారులు బలవంతంగా తొలగించారు. దీంతో ఆగ్రహించిన హమాలీలు ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకున్నారు.
38 మందికి స్థలాల కేటాయింపు
1992లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ శివారులోని 248 సర్వే నంబర్‌లోని 3 ఎకరాల 27 గుంటలను 38 మంది నిరుపేదలైన హమాలీలకు ఇళ్లు నిర్మించుకోవడానికి కేటాయించింది. స్థలాలు పొందిన వారు రెండు గదులతో ఇల్లును నిర్మించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఎవరూ నివసించకపోవడంతో 2016లో రెవెన్యూ అధికారులు స్వాఽధీనం చేసుకొని ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు. హమాలీ కాలనీ ఉన్న 3 ఎకరాల 27 గుంటులను కలుపుకొని మొత్తం ఐదెకరాల స్థలాన్ని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 24న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 25న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఆ ఐదు ఎకరాల స్థలాన్ని అప్పగించారు. అయితే గురువారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ సహాయంతో ఈ స్థలంలోని నిర్మాణాలను అధికారులు బలవంతంగా తొలగింపజేశారు.
దౌర్జన్యంగా లాక్కుంటున్నారు
పట్టణంలో ఎన్నో ప్రభుత్వ భూములు ఒక పక్క కబ్జాకు గురువుతున్నా అధికారులు వాటినేమి పట్టించుకోకుండా నిరుపేదలైన తమ భూములనే దౌర్జన్యంగా లాక్కుంటున్నారని లబ్ధిదారులు వాపోయారు. ఈ విషయంతో అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము హమాలీ పని చేస్తూ జీవనం సాగించే వాళ్లమని, తమది రెక్కాడితే గాని డొక్కాడని జీవితమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇంటి స్థలాన్ని కేటాయించడంతో అందులో అష్టకష్టాలు పడి రెండు గదుల ఇళ్లను నిర్మించుకున్నామని, ఇది పాడుబడడంతో మరమ్మతులు చేసుకొని నివాసం ఉంటున్నామని చెప్పారు. ఇప్పుడేమో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఈ స్థలాన్ని కేటాయించామని చెబుతూ అధికారులు లాక్కున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యలయంలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని లబ్ధిదారులు తెలిపారు. వారికి ఇచ్చిన స్థలానికి బదులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తే సంతోషిస్తామని తెలియజేశారు. ఏదీ ఇవ్వకుండా స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కుంటే ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంజిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పేరిట తమలాంటి పేదవారికి ఇచ్చిన స్థలాలను లాక్కోవడం సరికాదని, కచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు తమ ప్రాణాలు పోయిన స్థలాన్ని వదిలిపెట్దేది లేదని స్పష్టం చేశారు.
పేదలకు న్యాయం చేస్తాం : రవికుమార్, తహసీల్దార్ మెదక్
ఎవరికీ ఉద్దేశ పూర్వకంగా అన్యాయం చేయం. కాకపోతే వారికిచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎవరు ఉండడం లేదు. వారి సర్టిఫికెట్లు కూడా రద్దు అయినట్లు మా దృష్టికి రావడంతో నాలుగేళ్ల క్రితం స్థలాన్ని స్వాఽధీనం చేసుకొని ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టాం. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఐదెకరాల స్థలాన్ని మెదక్‌జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించాం. నిరుపేదలు తమకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పకుండా న్యాయం జరిగిలా చూస్తాం. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు కృషి చేస్తాం.
నిరుపేదలకు అండగా ఉంటాం : శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
1992లో మా తండ్రి హయాంలో దాదాపు 50 మంది కుటుంబాలకు 248 సర్వే నంబర్‌లో స్థలాన్ని కేటాయించారు. 2004లో నా ఆధ్వర్యంలో వాల్మీకి స్కీం కింద పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణం. నిరుపేదలపై ఉక్కుపాదం మోపడం ఎంత వరకు సమంజం. వెంటనే ప్రభుత్వం ఆ స్థలాన్ని వారికి కేటాయించాలి. నిరుపేదలకు అండగా ఉంటాం.