ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-09-16T07:03:04+05:30 IST

జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగి

ముంచెత్తిన వాన

మెదక్‌ జిల్లాలో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం

పాపన్నపేట మండలం మిన్‌పూర్‌లో అత్యధికంగా 11.2 సెంటీమీటర్లు

సంగారెడ్డి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు నమోదు

పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

వందల ఎకరాల్లో నీట మునిగిన పంటలు


మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లాలో సగటున 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా పాపన్నపేట మండలంలోని  మిన్‌పూర్‌ గ్రామంలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సగటున 2.7 సెంటీమీటర్లు నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెండు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 15 : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికార వర్గాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా సగటున 27.00 మిల్లిమీటర్లు వర్షం కురియగా, పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షం కురిసింది. అత్యధికంగా కంగ్టి మండలంలో 94.6 మిల్లిమీటర్ల వర్షం కురియగా అతి తక్కువగా అమీన్‌పూర్‌, రామచంద్రాపురంలో 3.2 మిల్లిమీటర్ల వర్షం పడింది. కోహీర్‌ మండలంలో 92.0 మి.మీ.లు, జహీరాబాద్‌ మండలంలో 87.00 మి.మీ.లు, కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో 42.8 మి.మీ.లు, నారాయణఖేడ్‌ మండలంలో 38.4 మి.మీ.లు, మనూరులో 28.6 మి.మీ.లు, మొగుడంపల్లి మండలంలో 36.0 మి.మీ.లు, ఝరాసంగం మండలంలో 34.0 మి.మీ.ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షమే పడింది. 


చెరువులు, కుంటలకు జలకళ

నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ డివిజన్ల పరిధిలో చెరువులు, కుంటలు, వాగులు ఉప్పొంగాయి. కల్హేర్‌ సమీపంలోని మహరాజ్‌ వాగు వంతెనపై నుంచి నీరు ఉధృతంగా దిగువకు వెళుతున్నది. జహీరాబాద్‌ సమీపంలోని నారింజ ప్రాజెక్టుకు కూడా కోహీర్‌ ప్రాంతం నుంచి వర్షపు నీరు వరద రూపంలో చేరుతున్నది. కంగ్టి మండలంలో కురిసిన వర్షాలకు నాగూర్‌ (కె) వద్ద సరిహద్దు వంతెన కొట్టుకపోయింది. దాంతో కర్ణాటకలోని ప్రాంతాలకు కంగ్టి మండలానికి రాకపోకలు స్తంభించాయి. ఇదే మండలంలోని ముకుంద్‌ తండాలో ఆడె.జాగూర్‌కు చెందిన నివాస గృహం కూలి పోయింది. చాప్టా.కెలో పొలాలకు వెళ్లేందుకు రైతులు వేసుకున్న వంతెన కొట్టుకొని పోయింది. నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఏస్గీ- ఔదత్‌పూర్‌ మధ్యలో గల వంతెనపై  నుంచి వరద నీరు పారుతుంది.


ఈ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి, మినుములు, మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంటలు వందల ఎకరాలలో నీట మునిగి, కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది. కల్హేర్‌ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో సోయా పంట నీట మునిగి రైతులకు సుమారు రూ.2 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికార వర్గాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. అలాగే కోహీర్‌ నారింజవాగు పరీవాహక ప్రాంతంలో 900 ఎకరాల్లో పత్తి పంట, 300 ఎకరాల్లో సోయాబీన్‌, 50 ఎకరాల్లో మొక్కజొన్న, 20 ఎకరాల్లో మినుముల పంటలు దెబ్బతిన్నాయి. మనూర్‌ మండలం తోర్నాలలోనూ సుమారు యాభై ఎకరాల్లో మినుము పంట వరద నీటిలో మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.  వర్షాలకు ఆయా ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖాధికారులు పరిశీలించిన మీదట ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


అలుగు పారుతున్న నల్లవాగు

కల్హేర్ : డతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన నల్లవాగు పొంగిపొర్లడంతో దిగువన ఉన్న వాగులు ఉప్పొంగాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,493 అడుగులు కాగా మంగళవారం తెల్లవారుజాము వరకు ప్రాజెక్టు నీటి మట్టం 1,495.10 అడుగులకు చేరుకున్నది. ప్రాజెక్టు అలుగుపై నుంచి భారీ స్థాయిలో వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టులోకి 12,929 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అలుగుపై నుంచి 12,809 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా 110 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్‌ తెలిపారు.


మెదక్‌ జిల్లాలో..

మెదక్‌ అర్బన్‌/మెదక్‌ మున్సిపాలిటీ/వెల్దుర్తి : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 4.8 సెంటిమీటీర్ల వర్షపాతం నమోదైంది. ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురియడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. అత్యధికంగా పాపన్నపేట మండల పరిధిలోని మీన్‌పూర్‌ 11.2 నమోదైంది. రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. కనిపిస్తోంది. 


పొంగిన వాగులు..నిండిన చెరువులు

ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో గల చిన్నచిన్న ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చాలాచోట్ల చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. వెల్దుర్తి మండలంలోని ఎలకపల్లి ఖాన్‌ చెరువు, చర్లపల్లి నర్సుని చెరువు, కాలను శెట్టిపలి ఊర చెరువులు నిండి అలుగుపారాయి. సుమారు ఐదు వందల ఎకరాలకు నీరు అందించే దేవతల చెరువు లోకి 18 ఫీట్ల వరకు నీరు చేరాయి. హల్దీ వాగు మీదుగా నిర్మించిన కొన్ని చెక్‌ డ్యాములు పొంగి పొర్లుతుండగా, వెల్దుర్తిలోని గంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌ డాం పూర్తిగా నిండింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 


మెదక్‌ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకూలాయి. సోమవారం రాత్రి భారీగా వర్షం రావడంతో కాలనీల్లోని మురికి కాలువలు పొంగిపొర్లాయి. వార్డునంబర్‌ 23, 29, 31వ వార్డులలో మూడు ఇళ్లుపాక్షికంగా ధ్వంసమయ్యాయి. నవాబుపేట శివారులోని పొలాల్లో గల చెట్టు నేలకూలడంతో అక్కడే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగింది. 


మెదక్‌ జిల్లాలో మండలాల వారీగా నమోదైన వర్షపాతం

మెదక్‌ జిల్లాలో అత్యధికంగా పాపన్నపేట మండల పరిధిలోని మిన్‌పూర్‌లో 11.2 సెంటీమీటర్లు, చిన్నశంకరంపేట 10.9, నిజాంపేట, 10.5, చేగుంట 8.9, పెద్దశంకరంపేట 7.9, పాపన్నపేట 7.5, హవేళీఘణపూర్‌ 6.9, నార్సింగి 6.8, రామాయంపేట 6.4, మెదక్‌ 6.2, వెల్దుర్తి 3.6, తూప్రాన్‌ 3.5, టేక్మాల్‌ 3.2, కౌడిపల్లి 2.9, కొల్చారం 2.2  సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-09-16T07:03:04+05:30 IST