అలవోకగా బొమ్మలేస్తాడు

ABN , First Publish Date - 2020-03-13T10:44:40+05:30 IST

అలవోకగా బొమ్మలేస్తాడు

అలవోకగా బొమ్మలేస్తాడు

చిత్రలేఖనంలో ప్రావీణ్యాన్ని సంపాదించిన సాయి గణేష్‌

బాల్యం నుంచే టీవీలో చూసి స్వయంగా నేర్చుకున్న విద్య

పోటీల్లో ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల


సంగారెడ్డి రూరల్‌, మార్చి 12:
ఏ విద్యలోనైనా రాణించాలంటే ఎవరైనా ముందుగా గురువుల వద్ద శిక్షణ పొందాల్సిందే. అలాంటివేమీ లేకుండా టీవీల్లో వచ్చే కార్యక్రమాలను వీక్షిస్తూ ఏకలవ్యుడిలా చిత్రలేఖనంలో ఆరితేరాడు సంగారెడ్డిలోని బ్రిలియెంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ విద్యార్థి శ్రీసాయి గణేష్‌(6వ తరగతి). చదువులోనూ బ్రిలియంటైన ఈ విద్యార్థి వివిధ దేవతా మూర్తుల చిత్రాలనే కాదు, ఓనమాలతో దేవుళ్ల బొమ్మలను కూడా గీసి పలువురి ప్రశంసలందుకున్నాడు. 


జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి చెందిన ప్రభాకర్‌చారి, రమాదేవి దంపతులు కుమారుడు శ్రీసాయి గణేష్‌ బాల్యం నుంచే టీవీలో పెయింటింగ్‌ కార్యక్రమాలను తిలకిస్తూ చిత్రలేఖనంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఎల్‌కేజీలో ఉండగా భక్తి టీవీ, డిస్నీ జూనియర్‌లో ప్రసారమైన పలు కార్యక్రమాలను చూస్తూ పలకలపై బొమ్మలు గీయడం ప్రారంభించాడు. క్రమం తప్పకుండా వీక్షిస్తూ పెన్సిల్‌తో కాకుండా నేరుగా పెన్నుతోనే భగవంతుడి చిత్రాలను వేయడం నేర్చుకున్నాడు. ఎల్‌కేజిలో ఉండగానే వివిధ దేవతామూర్తుల చిత్రాలను గీసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. సాయి గణే్‌షలో ఉన్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు చిత్రలేఖనంలో ప్రోత్సహించారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌, భగత్‌సింగ్‌ల బొమ్మలను, తెలుగు ఓనమాలు అ, ఆ అక్షరాలతో దేవతా మూర్తుల బొమ్మలను వేసి పలువురు ప్రముఖుల ప్రశంసలను పొందాడు సాయి గణేష్‌. అంతే కాదు మనం ఓపికగా కూర్చుంటే మన బొమ్మలను కూడా అలవోకగా వేసి చూపిస్తానంటున్నాడు. వివిధ సంస్థలు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతగా నిలిచి ప్రముఖుల నుంచి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందుకున్నాడు. ఒక్క చిత్రలేఖనంలోనే కాదు షావ్‌లిన్‌ కుంగ్‌ఫూ కరాటే విద్యలో రమేష్‌ మాస్టర్‌ వద్ద ప్రావీణ్యం పొంది ఎల్లో బెల్టును సాధించాడు గణేష్‌.


ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేయిస్తా

చిత్రలేఖనంలో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చేందుకు ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేయిస్తా. నాకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. భవిష్యత్తులో పెద్ద ఆర్టిస్ట్‌ను అవ్వాలని ఉంది.

- శ్రీసాయి గణేష్‌, విద్యార్థి, సంగారెడ్డి

Updated Date - 2020-03-13T10:44:40+05:30 IST